జూన్ 25ను 'రాజ్యాంగ హత్యా దినం'గా ప్రకటించిన కేంద్రం

by S Gopi |
జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రం ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎమెర్జెన్సీ విధించి ఐదు దశాబ్దాలు గడుస్తున్న నేపథ్యంలో జూన్ 25వ తేదీని 'సంవిధాన్ హత్యా దివస్'గా పాటిస్తున్నట్లు ప్రకటించింది, దీని అర్థం 'రాజ్యాంగ హత్యా దినం'. ఈ మేరకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌ను పోస్ట్ చేసిన హోం మంత్రి.. '1975, జూన్ 25 నాడు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నియంతృత్వ ఆలోచనా ధోరణితో ఎమర్జెన్సీని విధించడం ద్వారా ప్రజాస్వామ్య గొంతును నులిమేశారు. తమ తప్పు లేకుండా లక్షలాది మందిని కటకటాల వెనక్కి నెట్టారు. మీడియా స్వరాన్ని నొక్కేశారు. అప్పటి చీకటి రోజులకు నిరసనగా ఇకమీదట ప్రతి ఏడాది జూన్ 25ను 'సంవిధాన్ హత్య దివస్ 'గా పాటించాలని నిర్ణయించాం. ఆ రోజున 1975 ఎమర్జెన్సీ అమానవీయ వేదనను, బాధలను భరించిన వారందరిని స్మరించుకుందామని ' అమిత్ షా ట్వీట్ చేశారు.

రాజ్యాంగాన్ని అణచిన రోజులను గుర్తుచేస్తుంది: ప్రధాని మోడీ

జూన్ 25వ తేదీని 'రాజ్యాంగ హత్య దినం'గా పాటించడం ద్వారా రాజ్యాంగాన్ని అణగదొక్కిన సమయంలో ఏమి జరిగిందో గుర్తుచేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటనలో అన్నారు. ఎక్స్ వేదికగా.. దేశ చరిత్రలో కాంగ్రెస్ చీకటి దశలో ఎమర్జెన్సీ కారణంగా నష్టపోయిన ప్రతి వ్యక్తికి నివాళులర్పించే రోజుగా జూన్ 25 ఉంటుందని ' మోడీ ట్వీట్ చేశారు.

1975లో అసలేం జరిగింది..

'రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు '.. 1975, జూన్ 25న అప్పుడు ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ రేడియోలో దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రకటన ఇది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అమలైంది. అది 1977, మార్చి 21 వరకు 21 నెలల పాటు కొనసాగింది. ఇందిరా గాంధీ కోరిక మేరకు అప్పటి భారత రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ ఎమర్జెన్సీని విధించారు. ఇందిరా గాంధీ ఆ నిర్ణయం తీసుకునేందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా అలహాబాద్ హైకోర్టు ఆమె పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసిన తర్వాతే ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఇందిరా గాంధీపై వ్యతిరేకత అంటే దేశంపై వ్యతిరేకత అనే పరిస్థితులు ఉండేవి. 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ రాయ్‌బరేలీ నుంచి యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి రాజ్ నారాయణ్‌పై లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే, ఆయన ఇందిరా గాంధీ ఎన్నికపై అలహాబాద్ హైకోర్టులో సవాలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి ఇందిరా గాంధీ గెలిచారని రాజ్ నారాయణ్ అప్పట్లో ఆరోపణలు చేశారు. ఇంకా ఇతర ఆరోపణలు కూడా ఆయన చేసి ఉన్నారు. దాంతో ఇందిరా గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ఆ సమయంలోనే ఆమె ఎమర్జెన్సీ విధించాలనే నిర్ణయం తీసుకున్నారు. అనంతర పరిణామాల్లో 1975, నవంబర్ 7న సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణ తర్వాత నిర్ణయాన్ని రద్దు చేసింది.

ఎమర్జెన్సీ సమయంలో ప్రతిపక్ష నేతలుగా ఉన్న జయప్రకాష్ నారాయణ్, వాజ్‌పేయీ, ఎల్‌కే అద్వానీ, మోరార్జీ దేశాయ్‌తో పాటు అనేక కీలక నేతలు ఖైదు చేయబడ్డారు. అనేక ఆంక్షల తర్వాత 1977, జనవరి 18న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఇందిరా గాంధీ ప్రకటించారు. అదే ఏడాది మార్చి 16-20 మధ్య ఎన్నికలు జరపగా, 21న ఎమర్జెన్సీని ఎత్తివేశారు.

'హెడ్‌లైన్ అటెన్షన్' కోసమే నిర్ణయం.. కాంగ్రెస్ స్పందన

జూన్ 25ని 'రాజ్యాంగ హత్యా దినం'గా పాటించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రతిస్పందనగా.. ప్రధాని నరేంద్ర మోడీ నైతికి పరాజయాన్ని సూచించే జూన్ 4వ తేదీని 'మోదీ ముక్త్ దివస్ 'గా పాటించాలని కనగ్రెస్ శుక్రవారం ప్రకటనలో తెలిపింది. జూన్ 4న ఫలితాలు వెలువడిన లోక్‌సభ ఎన్నికల్లో సాధారణ మెజారిటీకి 32 సీట్లు తక్కువగా బీజేపీ 240 సీట్లను మాత్రమె గెలిచింది. ప్రధాని మోడీ మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీట్లను కోల్పోవడం ప్రధాని మోడీ నైతిక ఓటమిగానే భావించాలని కాంగ్రెస్ పేర్కొంది. ఈ అంశంపై మాట్లాడిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్.. కేంద్రం నిర్ణయం 'హెడ్‌లైన్ అటెన్షన్' కోసమే ప్రకటించినట్టుగా ఉందన్నారు.

Advertisement

Next Story