- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలక్టోరల్ బాండ్స్ లెక్క : రూ.16వేల కోట్ల విరాళాల్లో ఏ పార్టీకి ఎన్ని ?
దిశ, నేషనల్ బ్యూరో : ‘ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్’ను సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పుడు దేశమంతటా వాటి గురించే చర్చ జరుగుతోంది. 2018 సంవత్సరంలో ఆ బాండ్ల జారీ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రాజకీయ పార్టీలకు అందిన విరాళాలపై డిస్కషన్ నడుస్తోంది. 2018 మార్చి నుంచి 2024 జనవరి వరకు పొలిటికల్ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల విక్రయాల ద్వారా రూ.16,518 కోట్ల విరాళాలను పొందాయి. ఈ వ్యవధిలో మొత్తం 28,030 ఎలక్టోరల్ బాండ్లను రాజకీయ పార్టీల తరఫున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) విక్రయించింది. మొత్తం రూ.16,518 కోట్ల విరాళాల్లో 60 శాతానికిపైగా (రూ.10,122 కోట్లు) ఒక్క బీజేపీకే వచ్చాయి.
రెండు, మూడో స్థానాల్లో..
ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాల సేకరణలో రెండో స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. మొత్తం విరాళాల్లో 10 శాతం (రూ.1547 కోట్లు) హస్తం పార్టీ అకౌంట్లో జమయ్యాయి. మూడో ప్లేస్‌లో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నిలిచింది. మొత్తం విరాళాల్లో 8 శాతం (రూ. 823 కోట్లు) టీఎంసీ అకౌంట్లోకి చేరాయి. ఇప్పటివరకు సీపీఎంకు రూ.367 కోట్లు, ఎన్సీపీకి రూ. 231 కోట్లు, బీఎస్పీకి రూ.85 కోట్లు, సీపీఐకి రూ.13 కోట్లు ఎన్నికల బాండ్ల ద్వారా లభించాయి. ఇప్పటివరకు ఎన్నికల బాండ్ల ద్వారా 30 రాజకీయ పార్టీలకు అందిన మొత్తం విరాళాలతో పోలిస్తే.. బీజేపీకి సమకూరిన విరాళాలు మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. 2018 నుంచి 2022 సంవత్సరం వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కాంగ్రెస్ పొందిన విరాళాల కంటే బీజేపీ పొందిన విరాళాలు ఐదు రెట్లు ఎక్కువ.
హైదరాబాద్ నంబర్ 2.. ముంబై నంబర్ 1
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీల ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ విక్రయాల్లో దేశ వాణిజ్య రాజధాని ముంబై నంబర్ 1 ప్లేసులో నిలిచింది. అక్కడ ఎలక్టోరల్ బాండ్స్ విక్రయాల ద్వారా రూ.4009 కోట్ల విరాళాలు వచ్చాయి. నంబర్ 2 ప్లేసులో ఉన్న హైదరాబాద్ నుంచి రూ.3554 కోట్ల విరాళాలు, మూడో స్థానంలో ఉన్న కోల్‌కతా నుంచి రూ.3333 కోట్ల డొనేషన్స్ అందాయి. న్యూఢిల్లీ నుంచి రూ.2324 కోట్లు, చెన్నై నుంచి రూ.1524 కోట్లు, గాంధీనగర్ (గుజరాత్) నుంచి రూ.629 కోట్లు, భువనేశ్వర్ నుంచి రూ.407 కోట్లు, బెంగళూరు నుంచి రూ.327 కోట్లు, జైపూర్ నుంచి రూ.148 కోట్ల విరాళాలు రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల విక్రయాల ద్వారా అందాయి.
బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీకి ఫండ్స్ ఇలా..
తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల జారీ ద్వారా విరాళాల సేకరణలో దూకుడును కనబర్చాయి. 2018 మార్చి నుంచి 2023 మార్చి మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీకి రూ.912 కోట్లు, వైఎస్సార్ సీపీకి రూ.382 కోట్లు, టీడీపీకి రూ.146 కోట్ల విరాళాలు వచ్చాయి. తమిళనాడుకు చెందిన అధికార పార్టీ డీఎంకేకు రూ.616 కోట్ల డొనేషన్స్ అందాయి. ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.94 కోట్లు, కర్ణాటకకు చెందిన జేడీఎస్ పార్టీకి రూ.48 కోట్లు, బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు చెందిన జేడీయూకు రూ.24 కోట్లు విరాళంగా సమకూరాయి.
ఏమిటీ ఎలక్టోరల్ బాండ్స్ ?
2018 సంవత్సరంలో ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌ను అమల్లోకి తెచ్చారు. ఈ పథకంలో భాగంగా కాలపరిమితితో, వడ్డీ రహితంగా జారీ చేసే ఈ బాండ్ల విలువ రూ. 1000 నుంచి రూ. కోటి వరకు ఉంటుంది. వీటిని ప్రభుత్వ బ్యాంకుల నుంచి కొనొచ్చు. వీటిని ఏడాది పొడవునా నిర్దేశించిన సమయాల్లో మాత్రమే విక్రయిస్తుంటారు. ప్రజలతో పాటు సంస్థలు కూడా ఈ బాండ్లను కొని రాజకీయ పార్టీలకు విరాళంగా అందించొచ్చు. ఆ పార్టీలు 15 రోజుల్లోగా వీటిని బ్యాంకులో జమచేసి డబ్బులను పొందుతాయి. కేవలం గత పార్లమెంటు లేదా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒక శాతం కంటే ఎక్కువ ఓట్లు పొందిన రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలే ఈ బాండ్లను పొందేలా నిబంధనలు తీసుకొచ్చారు.
సుప్రీంకోర్టు తీర్పులో ఏముంది ?
ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు గురువారం ఉదయం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఆర్టికల్ 19(1)(ఏ)తో పాటు సమాచార హక్కు చట్టానికి ఇవి విఘాతం కలిగిస్తున్నాయని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు ఇచ్చింది. నల్లధనం నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం కాదని వెల్లడించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకోకు దారి తీస్తుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ కచ్చితంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్‌లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై విచారణ పూర్తయిన సందర్బంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. ఈ బాండ్స్‌ని విక్రయించకూడదని ఆదేశించింది. విరాళాలిచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదని మందలించింది. ఎన్నికల కమిషన్, ఎస్బీఐ తమతమ వెబ్‌సైట్‌లలో విరాళాల వివరాలను పొందుపర్చాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. పార్టీలకు వచ్చిన నిధులు ఎవరు ఇచ్చారో తెలియాలని వెల్లడించింది.