మణిపూర్‌, యూపీలో భూకంపాలు

by Shamantha N |
మణిపూర్‌, యూపీలో భూకంపాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించింది. యూపీలోని సోన్ భద్ర జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం 3.49 గంటలకు స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.9 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైందని పేర్కొంది. మరోవైపు మణిపూర్ లోని చందేల్ లో ఆదివారం తెల్లవారుజామున 2.28 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రం 70 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైంది. అయితే, భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. కాగా.. రెండు రాష్ట్రాల్లోనూ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ఈశాన్య ప్రాంతంలో వరదలు

గత నెల 28న ఉత్తరాఖండ్‌లోని పితోర్ గఢ్‌లోనూ 3.1తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పుడు కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు, రెమాల్ తుపాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఈశాన్య ప్రాంతంలోని అనేక చోట్ల వరద పరిస్థితి భయంకరంగా కొనసాగుతోంది. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చోటాబెక్రా వద్ద బరాక్ నది దాని ప్రమాద స్థాయి 26.2 మీటర్ల కంటే 2.07 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. నీటి మట్టం తగ్గుముఖం పట్టినప్పటికీ 28.27 మీటర్ల మేర ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Next Story