లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌కు కూడా షాక్.. ఏమైందంటే ?

by Hajipasha |
లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌కు కూడా షాక్.. ఏమైందంటే ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాంలోని మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లను వరుసపెట్టి దాటవేస్తున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. ఈడీ చేసిన ఫిర్యాదులపై విచారణను ఎదుర్కొనేందుకు శనివారం (మార్చి 16న) తమ ఎదుట హాజరుకావాలని ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ కోర్టు కేజ్రీవాల్‌కు జారీ చేసిన సమన్లపై స్టే ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టులోని సెషన్స్ కోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఈడీ విచారణ నుంచి మినహాయింపును పొందాలని భావిస్తే శనివారం రోజు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ ఎదుటే హాజరుకావాలని ఆదేశించింది. విచారణకు హాజరుకావాలంటూ దాదాపు ఎనిమిది సార్లు ఈడీ సమన్లు జారీ చేసినా సీఎం కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు. దీనిపై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈడీ రెండు ఫిర్యాదులు దాఖలు చేసింది. కేజ్రీవాల్‌ను కోర్టుకు పిలిచి న్యాయవిచారణ చేయాలని కోరింది. దీంతో మార్చి 16న (శనివారం) విచారణకు రావాలని ఆప్ చీఫ్‌ను కోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ సెషన్స్ కోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌కు తాజాగా శుక్రవారం ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఎదుట విచారణకు హాజరు కావాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Advertisement

Next Story