Delhi Coaching Centre : ఢిల్లీ కోచింగ్ సెంటర్ మరణాలపై కీలక అప్‌డేట్

by Hajipasha |
Delhi Coaching Centre : ఢిల్లీ కోచింగ్ సెంటర్ మరణాలపై కీలక అప్‌డేట్
X

దిశ, నేషనల్ బ్యూరో : గత నెలలో దేశ రాజధాని ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ బేస్మెంట్‌లోకి వరదనీరు పోటెత్తి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు చనిపోయిన ఘటనపై న్యాయ విచారణ ముగిసింది. ఈ కేసును విచారించిన ఢిల్లీలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి అంజు బజాజ్ చందనా ఆగస్టు 23న తీర్పును వెలువరిస్తానని శనివారం ప్రకటించారు. రావూస్ కోచింగ్ సెంటర్‌‌కు చెందిన నలుగురు సహ యజమానులు పర్వీందర్ సింగ్, తాజీందర్ సింగ్, హర్విందర్ సింగ్, సరబ్జిత్ సింగ్‌‌తో పాటు సీబీఐ వాదనలను విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కోచింగ్ సెంటర్ బేస్మెంట్‌లోకి వరద పోటెత్తడం అనేది దేవుడి చర్య అని దానితో తమకు సంబంధం లేదని రావూస్ కోచింగ్ సెంటర్‌‌ సహ యజమానులు కోర్టుకు తెలిపారు. ఢిల్లీ నగర పాలక సంస్థ వారు సరిగ్గా విధులు నిర్వర్తించి ఉంటే ఆ ప్రమాదం తప్పి ఉండేదన్నారు. రావూస్ కోచింగ్ సెంటర్‌ బేస్మెంట్‌లో లైబ్రరీ లేదని, అది విద్యార్థుల వెయిటింగ్ ఏరియా మాత్రమేననే నిందితులు కోర్టుకు చెప్పారు.

ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే రావూస్ కోచింగ్ సెంటర్‌‌కు చెందిన నలుగురు సహ యజమానులు వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లారని వారి తరఫు న్యాయవాది గుర్తు చేశారు. ఇక సీబీఐ తరఫున అనిల్ కుమార్ కుశవాహ వాదనలు వినిపిస్తూ.. ‘‘బేస్మెంట్‌లో ముగ్గురు విద్యార్థులు దారుణ స్థితిలో ప్రాణాలు వదిలారు. వాళ్లు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొని ఉంటారో ఊహించుకోండి. కేవలం 25 రోజులు జైలులో ఉన్నందుకే రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ సహ యజమానులు నలుగురు ఊపిరాడని పరిస్థితిని ఫీలవుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. వారికి సమాజంలో మంచి పలుకుబడి ఉందని, జైలు నుంచి బయటికి పంపితే సాక్ష్యాలను తారుమారు చేస్తారని కోర్టుకు తెలిపారు. ఈ కేసు విషయంలో కోర్టు ఎలాంటి తీర్పును వెలువరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed