Oath Taking: మహా కేబినెట్ ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్

by Mahesh Kanagandla |
Oath Taking: మహా కేబినెట్ ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఫలితాలు వెలువడి వారం గడిచినా సీఎం(Maharashtra CM) ఎవరనేది మహాయుతి నేతలు(Mahayuti Leaders) ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. కేంద్రమంత్రులు అమిత్ షా(Amit Shah), జేపీ నడ్డాలతో భేటీ తర్వాత కూడా ఈ విషయంపై సస్పెన్స్ కొనసాగడం మహాయుతి నాయకుల మధ్య సమన్వయంపై ప్రశ్నలు రేకెత్తించింది. అమిత్ షాతో భేటీ మరుసటి రోజు ఉన్నట్టుండి సమావేశాలను రద్దు చేసుకుని ఏక్‌నాథ్ షిండే సొంతూరుకు వెళ్లడం కూడా అనుమానాలను రెట్టింపు చేసింది. ఇలాంటి సందర్భంలో మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవంకులే ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. సీఎం ఎవరు? కేబినెట్ బెర్తులు ఎవరికి ఎన్ని అనేది అధికారికంగా తేలకముందే ప్రమాణ స్వీకార(Oath Taking Ceremony) కార్యక్రమాన్ని ప్రకటించారు. డిసెంబర్ 5వ తేదీన ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో మహాయుతి కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు మహాయుతి నాయకులు ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లను ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ చేశారు. సీఎం, పోర్ట్‌‌ఫోలియోల కేటాయింపులపై పలుమార్లు చర్చలు జరిగినా ఏ పార్టీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde)కు వార్నింగ్?

ఉద్ధవ్ ఠాక్రే పార్టీపై తిరుగుబాటు చేసి బీజేపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఏక్‌నాథ్ షిండే.. ఈ ఎన్నికల్లో ప్రజానేతగా సీట్లతో నిరూపించుకున్నా, సీఎంగా కొనసాగే అవకాశాలు కరిగిపోయాయి. ఏక్‌నాథ్ షిండేకే సీఎం చాన్స్ ఇవ్వాలని శివసేన పలుమార్లు డిమాండ్ చేసినా అమిత్ షా భేటీలో సీఎం పదవి బీజేపీకే అని డిసైడ్ అయినట్టు తెలిసింది. అంతకుముందే బీజేపీ పెద్దల నిర్ణయాన్ని శిరసావహిస్తానని, ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకిగా మారబోనని షిండే తెలిపారు. డిప్యూటీ సీఎం పదవిపై ఆయన నిరాసక్తిగా ఉన్నారని, శివసేన హోం శాఖను కోరుకుంటున్నదనే వార్తలు వచ్చాయి. కానీ, బీజేపీ హోం పోర్ట్‌ఫోలియోను వదులుకునేందుకు సిద్ధంగా లేదనీ తెలిసింది. ఈ పరిణామాలు ఏక్‌నాథ్ షిండేను గాయపరిచినట్టు తెలుస్తు్న్నది. ఈ క్రమంలోనే అమిత్ షాతో భేటీ తర్వాతి రోజు ఉన్నట్టుండి ఏక్‌నాథ్ షిండే సతారాలోని సొంతూరుకు వెళ్లిపోయారు. ఫలితంగా సీఎం సీటుపై నిర్ణయం వాయిదా పడింది. ఏక్‌నాథ్ షిండే ఏ విషయమైనా ఆలోచించుకోవాలని భావిస్తే సొంతూరుకు వెళ్లుతారని శివసేన పేర్కొనడం వంటివి మహాయుతిలో విభేదాలున్నట్టు సంకేతాలనిచ్చాయి. ఈ నేపథ్యంలోనే సీఎం సీటుపై నిర్ణయం పెండింగ్‌లో ఉన్నప్పటికీ బీజేపీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి డేట్ ఫిక్స్ చేసి ప్రకటించేసింది. ఇది ఏక్‌నాథ్ షిండేకు పరోక్ష వార్నింగ్ అని కొందరు చర్చిస్తున్నారు. ఏక్‌నాథ్ షిండే అలకవీడి ప్రభుత్వ ఏర్పాటుకు, బీజేపీ నిర్ణయాలకు కట్టుబడాలని, ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఇక ఆగబోదనే సంకేతాలను ఇచ్చినట్టయిందని చెబుతున్నారు. బీజేపీకి రెండు పార్టీల్లో ఏ ఒక్క పార్టీ మద్దతున్నా ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా బలం కలిగి ఉంటుంది.

రెండు డిప్యూటీ సీఎం పోస్టులు

మహాయుతి ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందని, కొత్త ప్రభుత్వం ఒక సీఎం, రెండు డిప్యూటీ సీఎం పోస్టులు ఉంటాయని అమిత్ షాతో భేటీలో తేలిపోయిందని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ తెలిపారు. సీఎం సీటు కూడా బీజేపీకేననే స్పష్టత అదే భేటీలో వచ్చిందని వివరించారు. ప్రభుత్వ ఏర్పాటు జాప్యంపై వస్తున్న సంశయాలను ఆయన కొట్టిపారేశారు. మహారాష్ట్రలో ఇది కామన్ అని, 1999లో ఏకంగా నెలరోజులు ఆలస్యమైందని తెలిపారు. సీఎం సహా 43 కేబినెట్ స్థానాలుండే మహారాష్ట్రలో బీజేపీ 20 నుంచి 22 సీట్లు తనవద్దే ఉంచుకోనున్నట్టు తెలుస్తున్నది. శివసేనకు 12, ఎన్సీపీకి 9 కేబినెట్ స్థానాలు ఇచ్చే చాన్స్ ఉన్నది.

బీజేపీలో సీఎం రేసు?

సీఎం సీటు బీజేపీకే అనేది కన్ఫమ్. బీజేపీలో ఈ పోస్టుకు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అందరి ఫేవరేట్. కానీ, ఆయనతోపాటు మరికొందరు బీజేపీ నేతలు కూడా సీఎం సీటు రేసులో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కేంద్రమంత్రి మురళీధర్ మొహొల్, రాధాకృష్ణ విఖే పాటిల్, వినోద్ తావ్డేలు రేసులో ఉన్నట్టు తెలిసింది. కేంద్రమంత్రి మురళీధర్ ఈ వార్తలను కొట్టివేశారు. అదంతా సోషల్ మీడియాలో వట్టి ప్రచారమని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed