Chennai Rains: చెన్నైలో ఫెయింజల్ బీభత్సం.. ఏపీ, తెలంగాణలో అలర్ట్

by Mahesh Kanagandla |
Chennai Rains: చెన్నైలో ఫెయింజల్ బీభత్సం.. ఏపీ, తెలంగాణలో అలర్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఫెయింజల్ తుఫాన్(Fengal Cyclone) పుదుచ్చేరి, తమిళనాడు(Tamilnadu)పై.. ముఖ్యంగా చెన్నై(Chennai) నగరంపై పంజా విసిరింది. తుఫాన్ నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. చెన్నైలో కనీసం 53 రోడ్లు నీటమునిగిపోయాయి. నిన్న రాత్రి ఫెయింజల్ తుఫాన్ పుదుచ్చేరి, తమిళనాడు తీరాల మధ్య కరైకాల్, మహాబలిపురం సమీపంలో తీరం దాటింది. తీరం దాటే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీశాయి. తీరం దాటడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని ఐఎండీ పేర్కొంది. తుఫాన్ నేపథ్యంలో శనివారమే తమిళనాడు వ్యాప్తంగా భీకరవర్షం కురిసింది. ఫలితంగా చెన్నై ఎయిర్‌పోర్టును మూసేశారు. డిసెంబర్ 1వ తేదీ తెల్లవారుజామున 4 గంటల వరకు మూసివేస్తామని శనివారం అధికారులు వెల్లడించారు. ఆదివారమంతా తమిళనాడులో భారీవర్షాలు పడుతాయని తెలిపారు. శనివారం సాయంత్రానికి సుమారు 226 ఫ్లైట్లను రద్దు చేశారు. పలు ట్రైన్లను రద్దు చేయగా.. కొన్నింటిని రీషెడ్యూల్ చేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజల జనజీవనం స్తంభించింది. చెన్నైలోని డెమెల్లోస్ రోడ్డు, పెరంబూరు హై రోడ్, ఫులియంతోప్ హైరోడ్లపై మోకాలు లోతు వరదనీరు వచ్చి చేరింది. స్టీఫెన్సన్ రోడ్డు, పట్టాలం, గాంధీనగర్, గనేశాపురం ఏరియాల్లో నడుములోతు వరదనీరు వచ్చింది. కాగా, చెన్నైలో తుఫాన్ కారణంగా వర్ష సంబంధ ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ముగ్గురూ విద్యుత్ షాక్‌తోనే మృతిచెందారు. తుఫాన్‌ను ఎదుర్కోవడానికి ముందుజాగ్రత్తలపై సీఎం ఎంకే స్టాలిన్ సమీక్ష నిర్వహించారు. చెన్నైలో పరిస్థితులను సమీక్షించిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్.. వరద నీటిని ఎత్తిపోయడానికి 1700 మంది కార్మికులను గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పనిలో పెట్టిందని వివరించారు.

ఏపీ, తెలంగాణల్లో..

ఫెయింజల్ తుఫాన్ ప్రభావం ఏపీ, తెలంగాణల్లోనూ ఉన్నది. దక్షిణ తీర ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడే చాన్స్ ఉన్నదని, ఎస్పీఎస్ఆర్-నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అధికారులు అలర్ట్‌గా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక తెలంగాణలో ఆదివారం, సోమవారాల్లో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ సహా పలుచోట్ల వర్షాలు పడే అవకాశముందని, ఈ ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed