- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనుగడ కోసం సీపీఎం పోరాటం.. రిస్క్‌లో ‘సుత్తి, కొడవలి..’
దిశ, నేషనల్ బ్యూరో: సుత్తి, కొడవలి గుర్తుతో ఎన్నో పోరాటాలు చేసిన కమ్యూనిస్టు పార్టీ.. ఇప్పుడు సుత్తి, కొడవలి గుర్తు కోసమే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ ఉద్యమాలన్నీ ‘ఎరుపు రంగు, సుత్తి, కొడవలి, నక్షత్రం’ గుర్తుతోనే జరిగాయి. రష్యన్ విప్లవం తరువాత, సోవియట్ యూనియన్‌కు చెందిన ఈ చిహ్నం.. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన అనేక కమ్యూనిస్ట్ పార్టీల గుర్తుగానూ మారిపోయింది. భారత్‌లోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) గుర్తు కూడా అదే సోవియట్ చిహ్నం నుండి తీసుకున్నారు. సీపీఎం గుర్తులో ఉండే కొడవలి రైతులను సూచిస్తే, సుత్తి కార్మికులను, నక్షత్రం విప్లవం, కమ్యూనిస్ట్ భావజాలాన్ని సూచిస్తుంది. అయితే, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ గుర్తు సీపీఎంకు దక్కకుండా పోయే పరిస్థితులు నెలకొన్నాయి. సీపీఐ ఇటీవలే జాతీయ పార్టీ హోదాను కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘సీపీఎం’కు సైతం ఇదే గండం వెంటాడుతోంది.
ఒకప్పుడు బలంగా..
భారత్‌లో ఒకప్పుడు బలంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు క్రమంగా మరుగున పడుతున్నాయి. 2004లో వామపక్షాలకు లోక్‌సభలో 59మంది ఎంపీలు ఉండగా, ఇప్పుడు ఐదుగురు మాత్రమే ఉండటం గమనార్హం. పశ్చిమ బెంగాల్, త్రిపురలోనూ తమ పట్టును కోల్పోయాయి. వామపక్షాల నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు కేరళలో మాత్రమే ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ మొదటి ఎన్నికల నుండి భారతదేశంలోని ప్రధాన పార్టీలలో ఒకటిగా ఉండేది. ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొదటి పార్టీగా కూడా నిలిచింది. కమ్యూనిస్టు పార్టీ చీలిక తర్వాత 1964లో సీపీఎం ఏర్పడింది. ఇది క్రమంగా లెఫ్ట్ బ్లాక్‌లో అతిపెద్దదిగా మారింది. 2004వరకు ఎన్నికల్లో ప్రభావం చూపించిన సీపీఎం.. 2009 నుంచి 2019 మధ్య పశ్చిమ బెంగాల్, త్రిపురలో క్రమంగా పట్టు కోల్పోయింది.
పడిపోయిన ఓట్ల శాతం
2004 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం పశ్చిమ బెంగాల్‌లో 26, కేరళలో 12, తమిళనాడు, త్రిపురలో రెండేసి, ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి సహా 43 స్థానాలను గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో పార్టీ దేశవ్యాప్తంగా 5.66శాతం ఓట్లను సాధించింది. 2009 నాటికి సీపీఎం లోక్‌సభ స్థానాలు 16కు తగ్గాయి. బెంగాల్‌లో తొమ్మిది, కేరళలో నాలుగు, త్రిపురలో రెండు, తమిళనాడులో ఒక సీటు గెలుచుకుంది. కానీ, ఓట్ల శాతంలో (5.33%) మాత్రం అంతగా తగ్గుదల కనిపించలేదు. ఇక, 2014 లోక్‌సభ ఎన్నికల్లో, సీపీఎం కేవలం తొమ్మిది స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. కేరళలో ఐదు, బెంగాల్, త్రిపురలలో రెండు సీట్లు. అయితే, ఈసారి ఆ పార్టీ ఓట్ల శాతం 3.6శాతానికి పడిపోయింది. ఇక, 2019 ఎన్నికల్లో సీపీఎంకు కోలుకోలేని దెబ్బపడింది. లోక్‌సభకు కేవలం ముగ్గురు ఎంపీలను మాత్రమే పంపగలిగింది. తమిళనాడు నుండి ఇద్దరు అభ్యర్థులు, అధికారంలో ఉన్న కేరళ నుండి ఒకరు మాత్రమే. బెంగాల్, త్రిపురలలో లోక్‌సభలో సీపీఎం ఎంపీల సంఖ్య జీరోగా మారింది. 2004లో 5.66% ఉన్న ఓట్ల శాతం 2019 నాటికి 1.75%కి పడిపోయింది.
ఓట్లు పెంచుకోవాల్సిందే..
2024లోక్‌సభ ఎన్నికలు సీపీఎంకు మనుగడ కోసం పోరాటంలా మారాయి. జాతీయ పార్టీ హోదా పోకూడదంటే, సీపీఐ పరిస్థితి రాకూడదంటే సీపీఎం మరిన్ని సీట్లు సాధించి, ఓట్ల శాతాన్ని పెంచుకోవాల్సి ఉంది. లేదంటే, తమ పార్టీ గుర్తు కోల్పోయే ప్రమాదం ఉంది. జాతీయ పార్టీ హోదా కోల్పోకుండా ఉండాలంటే (లేదా పొందాలంటే) కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీకి రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉండాలి. లేదా దేశంలోని కనీసం మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ 2శాతం చొప్పున ఓట్లు పొందాలి. లేదా సార్వత్రిక ఎన్నికల్లో(అసెంబ్లీ లేదా లోక్‌సభ) నాలుగు అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో 6శాతం ఓట్లు.. వేర్వేరు రాష్ట్రాల నుంచి కనీసం 4 ఎంపీ సీట్లు సాధించాలి. ఇతర ప్రమాణాలు ఎలా ఉన్నా.. సీపీఎంకి లోక్‌సభలో నాలుగు ఎంపీ సీట్లు మాత్రం లేవు. ప్రస్తుతం ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్నారు. తమిళనాడు నుంచి ఇద్దరు, కేరళ నుంచి ఒకరు ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లలో ఆ పార్టీకి 1.77శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 25.97శాతం ఓట్లు రాగా, తమిళనాడులో 2.38శాతం ఓట్లు వచ్చాయి.
నేతల అలెర్ట్
సీపీఎంకు జాతీయ పార్టీ హోదా ప్రమాదంలో పడిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. ఈ ఎన్నికల్లో ఆ ప్రమాదం నుంచి గట్టెక్కాలనే పట్టుదలతో ఉన్నారు. ‘‘ఈ ఎన్నికల్లో వామపక్షాలకు అధికారిక గుర్తు(కొడవలి, సుత్తి, నక్షత్రం) ఉంది. దాన్ని కాపాడుకోవాలంటే పార్టీకి నిర్దిష్ట ఓట్ల శాతం లేదా ఎంపీలు ఉండాలి. లేని పక్షంలో ఎన్నికల సంఘం ఇచ్చే గుర్తులపైనే పోటీ చేయాల్సి ఉంటుంది’’ అని సీనియర్ నాయకుడు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఏకే బాలన్ ఇటీవలే వెల్లడించారు. కాగా, సీపీఎంకు ఎదురైన ఈ అస్తిత్వపు ముప్పు పార్టీ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఈ ప్రమాదం నుంచి బయటపడేందుకు తమ ఏకైక కంచుకోట అయిన కేరళలో ఓటు షేరింగ్‌ను పెంచుకోవడంపై దృష్టి సారించింది. పరిమిత ప్రభావం ఉన్న ప్రాంతాల్లో వామపక్ష స్వతంత్రులను రంగంలోకి దింపడం వంటి మునుపటి వ్యూహాల మాదిరిగా కాకుండా, సీపీఎం ఇప్పుడు కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకుగానూ 15స్థానాల్లో తమ అధికారిక గుర్తుతో పోటీ చేసింది. ఇది తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి తోడ్పడుతుందని సీపీఎం భావిస్తోంది. రెండో దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా గత నెల 26న కేరళలోని మొత్తం 20 స్థానాలకూ పోలింగ్ జరిగింది. వీటి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.