Congress: భవిష్యత్తు కోసం "జై జవాన్" ఉద్యమం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |
Congress: భవిష్యత్తు కోసం జై జవాన్ ఉద్యమం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇద్దరు అగ్ని వీరుల మరణం బాధాకరమని, వీరమరణం పొందిన తర్వాత వారిపై వివక్ష ఎందుకని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శిక్షణలో ఉన్న అగ్నివీరుల మరణంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. నాసిక్‌లో శిక్షణ సమయంలో ఇద్దరు అగ్నివీరులు గోహిల్ విశ్వరాజ్ సింగ్, సైఫత్ షిత్ మరణించడం ఒక విషాద సంఘటన అని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే ఈ సంఘటన అగ్నివీర్ పథకంపై మరోసారి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తిందని, దీనికి బీజేపి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోందని వ్యాఖ్యానించారు.

గోహిల్, సైఫత్ కుటుంబాలకు ఇతర అమర జవానులతో సమానమైన పరిహారం సకాలంలో అందుతుందా? అని ప్రశ్నించారు. అంతేగాక అగ్నివీరుల కుటుంబాలకు పెన్షన్, ఇతర ప్రభుత్వ సౌకర్యాల ప్రయోజనాలు ఎందుకు అందవని, ఇద్దరు సైనికుల బాధ్యతలు, త్యాగాలు ఒకటే అయినప్పుడు, వీరమరణం పొందిన తర్వాత ఈ వివక్ష ఎందుకని మండిపడ్డారు. అగ్నిపథ్ పథకం వల్ల సైన్యానికి అన్యాయం.. మన వీర జవాన్ల అమరవీరులకు అవమానం జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సైనికుడి ప్రాణం మరో సైనికుడి ప్రాణం కంటే ఎందుకు విలువైనదో ప్రధాని, రక్షణ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అన్యాయాన్ని ఎదిరించాలని, బీజేపి ప్రభుత్వ 'అగ్నివీర్' పథకాన్ని తొలగించి, దేశ యువత, సైన్యం భవిష్యత్తును కాపాడటానికి మా 'జై జవాన్' ఉద్యమంలో పాల్గొనాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed