కౌన్ బనేగా లోక్ సభ స్పీకర్..? దేశ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోన్న పోటా పోటీ మీటింగ్స్

by Satheesh |   ( Updated:2024-06-25 13:44:36.0  )
కౌన్ బనేగా లోక్ సభ స్పీకర్..? దేశ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోన్న పోటా పోటీ మీటింగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్ సభ స్పీకర్ ఎన్నిక దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. లోక్ సభ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు ప్రతిపక్ష ఇండియా కూటమి సహకరించకపోవడంతో స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఫస్ట్ టైమ్ లోక్ సభ స్పీకర్ ఎంపికకు ఎన్నిక జరుగుతోంది. బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ కూటమి నుండి మాజీ స్పీకర్ ఓం బిర్లా బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నుండి సీనియర్ ఎంపీ సురేష్ పోటీ చేస్తున్నారు. రేపు (బుధవారం) లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్డీఏ, ఇండియా కూటములు దేశ రాజధానిలో ఢిల్లీలో పోటా పోటీ సమావేశాలు ఏర్పాటు చేశాయి.

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఎన్డీఏ కూటమి నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రేపు జరగాల్సిన స్పీకర్ ఎన్నికపై చర్చిస్తున్నారు. ఎన్డీఏ అభ్యర్థికి 298 ఓట్లు తగ్గకూడదని కూటమి భాగస్వామ్య పక్షాలకు అమిత్ షా సూచించారు. స్పీకర్ ఎన్నికకు ఏ ఒక్కరూ గైర్హాజరు కాకుడదని ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. ఇదిలా ఉండగానే, మరోవైపు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ కీలక నేతలు సమావేశమయ్యారు. స్పీకర్ ఎన్నికపై ఈ భేటీలో డిస్కస్ చేశారు. స్పీకర్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి బరిలో ఉండటంతో ఆ పార్టీ ఎంపీలకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. స్పీకర్ ఎన్నిక ఓటింగ్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఎంపీలను ఆదేశించింది.

బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ ఎన్నికపై దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, లోక్ సభ స్పీకర్ ఎన్నిక ఇప్పటీ వరకు ఏకగ్రీవంగా జరిగింది.అధికార పక్షానికి స్పీకర్, ప్రధాన ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవులు ఇవ్వడం అనవాయితీగా వస్తోంది. అయితే, డిప్యూటీ స్పీకర్ పదవి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఇచ్చేందుకు బీజేపీ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ అభ్యర్థిని పోటీలోకి దించింది. కాంగ్రెస్ పోటీలో ఉండటంతో స్వతంత్ర భారత దేశంలో ఫస్ట్ టైమ్ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది.

Advertisement

Next Story