నెహ్రూ హయాంలో స్వాధీనం చేసుకున్న భూభాగంలోనే చైనా మోడల్ విలేజ్- జైశంకర్

by Shamantha N |
నెహ్రూ హయాంలో స్వాధీనం చేసుకున్న భూభాగంలోనే చైనా మోడల్ విలేజ్- జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పై మరోసారి విరుచుకు పడ్డారు విదేశాంగ మంత్రి జై శంకర్. నెహ్రూ హయాంలోనే చైనా దురాక్రమణ జరిగిందని.. అప్పుడే భారత భూభాగాన్ని కోల్పోయామని ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్ లో చైనా మోడల్ గ్రామాన్ని నిర్మిస్తోందని.. తూర్పు లఢక్ లో భారత భూభాగాన్ని కోల్పోయామని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వీటిపైన జైశంకర్ స్పందించారు. చైనా మోడల్ గ్రామాన్ని నిర్మిస్తున్న ప్రాంతాన్ని నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో చైనా స్వాధీనం చేసుకుందన్నారు.

చైనా నిర్మిస్తున్న మోడల్ విలేజ్ లాంగ్జు ప్రాంతంలో ఉందని అన్నారు. పార్లమెంటు రికార్డులను పరిశీలించినా.. సరిహద్దు సమస్యపై ఏదైనా పుస్తకం చదివినా.. లాంగ్జు ప్రాంతం గురించి తెలుస్తుందన్నారు. 1959లో లాంగ్జు ప్రాంతం గురించి చైనా-భారత్ మధ్య చర్యలు నడిచాయని గుర్తుచేశారు. 1962లో చైనా స్వాధీనం చేసుకుందన్నారు. ఆ ఆక్రమణ గురించి తాను ఏం చేయలేనని జైశంకర్ స్పష్టం చేశారు. 'నన్ను క్షమించండి. నా చేతుల్లో లేదు' అని అన్నారు జైశంకర్.

ఇక రెండో అంశమైన ప్యాంగాంగ్ త్సో సరస్సు గురించి ప్రస్తావించారు జైశంకర్. ప్యాంగాంగ్ సరస్సుపై నిర్మిస్తున్న వంతెన ఖుర్నాక్ కోట ప్రదేశంలో ఉందని అన్నారు. 1958లో చైనీయులు ఖుర్నాక్ కోటకు వచ్చారని.. 1962 యుద్ధంలో ఆ ప్రాంతాన్ని చట్టవిరుద్ధంగా ఆక్రమించారని పేర్కొన్నారు.

షక్స్‌గామ్ లోయలో చైనీయులు నిర్మిస్తున్న రహదారిపైనా స్పందించారు. సియాచిన్‌లోని భారత భూభాగాలకు ముప్పు కలిగించే ఛాన్స్ ఉందన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఆ ప్రాంతాన్ని భాగం చేసేందుకు నెహ్రూ అనుమతించారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ చాలా తెలివిగా ద్వంద ప్రమాణాలు పాటిస్తూ.. ప్రసంగాలు చేస్తుందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ చైనా రాయబారిని రహస్యంగా కలుస్తారని ఆరోపించారు. మరోవైపు.. బహిరంగంగా మాత్రం గొప్ప జాతీయవాది అని చెప్పుకుంటారని అన్నారు. చైనాపై రాహుల్‌గాంధీ చేసిన ప్రసంగాలు చూడాలని సూచించారు. రాహుల్ కు చాలా విషయాలు తెలుసని.. ఆయన బెల్ట్ అండ్ రోడ్ (ఇనిషియేటివ్)పై విమర్శలు చేయకపవచ్చని పేర్కొన్నారు. చైనా పట్ల రాహుల్ అభిమానాన్ని గ్రహించగలరని విమర్శించారు.

Advertisement

Next Story