Rahul Gandhi: 'మోడీ చెప్పేది అబద్ధాలు.. చైనా ఆక్రమణే నిజం'

by Vinod kumar |
Rahul Gandhi: మోడీ చెప్పేది అబద్ధాలు.. చైనా ఆక్రమణే నిజం
X

న్యూఢిల్లీ : ముమ్మాటికీ భారత సరిహద్దు భూభాగాన్ని చైనా ఆర్మీ ఆక్రమించిన విషయమే వాస్తవమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత భూభాగాన్ని ఒక్క అంగుళం కూడా చైనా ఆక్రమించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెబుతున్నదంతా అబద్ధమని ఆరోపించారు. కార్గిల్‌లో శుక్రవారం నిర్వహించిన సభలో రాహుల్ మాట్లాడారు. ‘లడఖ్ ప్రాంత రక్తం, డీఎన్ఏలలో గాంధీజీ, కాంగ్రెస్ భావజాలం ఉంది. లడఖ్ ప్రాంత ప్రజల మనసులోని మాటను నేను విన్నాను’ అని ఆయన చెప్పారు. దేశంలో బీజేపీ, ఆరెస్సెస్ వ్యాపింపజేస్తున్న హింస, విద్వేషాలకు వ్యతిరేకంగా నిలిచేందుకే భారత్ జోడో యాత్రను నిర్వహించానని తెలిపారు. ఇతర నేతలు (మోడీ) మాత్రం తమ మనసులోని మాట (మన్ కీ బాత్) చెప్పడంలో బిజీగా గడుపుతారని విమర్శించారు. ఇక రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది మండిపడ్డారు.

రాహుల్ గాంధీకి చైనా మీద ఎందుకంత ప్రేమ ఉందో అర్థం కావడం లేదన్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు నిధులు వచ్చినందుకా అని నిలదీశారు. డోక్లాం వద్ద భారత్‌-చైనా మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన సమయంలో చైనా రాయబారితో కలిసి రాహుల్ విందు ఆరగించారని, ఆ విషయాన్ని ఆయన వెల్లడించలేదని, చైనా రాయబారి విడుదల చేసిన ఫొటో కారణంగా ఆ విషయం బయటపడిందని పేర్కొన్నారు. ‘1962లో చైనాతో యుద్ధం సమయంలో ప్రభుత్వానికి గట్టి మద్దతు తెలిపినందుకు ఆర్ఎస్ఎస్‌ను నాటి ప్రధాని నెహ్రూ ప్రశంసించారు. ఆర్ఎస్ఎస్ విషయంలో నెహ్రూ చెప్పింది కరెక్టా? మీరు ఇప్పుడు చెప్పేది కరెక్టా?’ అని రాహుల్ గాంధీని సుధాంశు త్రివేది ప్రశ్నించారు.

Advertisement

Next Story