ట్రెయినీ ఐఏఎస్ అధికారి వ్యవహారంపై కేంద్రం కమిటీ ఏర్పాటు

by S Gopi |
ట్రెయినీ ఐఏఎస్ అధికారి వ్యవహారంపై కేంద్రం కమిటీ ఏర్పాటు
X

దిశ, నేషనల్ బ్యూరో: ట్రెయినీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆమె ఐఏఎస్ అధికారి అయ్యేందుకు దివ్యాంగురాలిగా నకిలీ సర్టిఫికేట్ పొందారనే ఆరోపణల నేపథ్యంలో ఆమె కెల్యిమ్‌లు, ఇతర వివరాలను ధృవీకరించేందుకు కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండు వారాల్లో తన నివేదికను కేంద్రానికి అందించనుంది. 2023 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారి కూడా బ్యూరోక్రాట్‌గా తన పదవిని దుర్వినియోగం చేశారనే భారీ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆమె తన సొంత కారుపై సైరన్, వీఐపీ నంబర్ ప్లేట్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్లను వేయించారు. ఈ వివాదం కాస్త ముదరడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెను పూణె నుంచి వాషిమ్‌కి బదిలీ చేశారు. ఈ వ్యవహారం కేంద్రంలో ప్రధానమంత్రి కార్యాలయం వరకు చేరడంతో ఏక సభ్య కమిటీని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శి స్థాయి సీనియర్ అధికారి అధ్యక్షత కమిటీ ఉంటుంది.

ట్రెయినీ ఐఏఎస్‌గా ఉన్న సమయంలో ఆమెకు ఎటువంటి సౌకర్యాలు ఉండవు. కానీ, అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ఇవి కాకుండా కలెక్టరేట్‌లో కిందిస్థాయి సిబ్బందిపై బెదిరింపులకు కూడా దిగారు. దానికి సంబంధించిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్‌లు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో ఆమె ఐఏఎస్గా ఎన్నికైన విధానంలోనూ లోపాలున్నట్టు బహిర్గతమైంది. ఐఏఎస్ అయిన తర్వాత మెడికల్ టెస్టులకు హాజరవలేదని, ఆమెకు కంటి, మానసిక సమస్యలు ఉన్నాయని కథనాలు వెలువడ్డాయి. పరీక్షలకు డుమ్మా కోట్టిందని, ఆమె సమర్పించిన ఓబీసీ సర్టిఫికేట్ సైతం నకిలీ అని ఆరోపణలు పెరిగాయి. నకిలీ అంగవైకల్యం సర్టిఫికేట్ ద్వారా ఆమె ఉద్యోగం పొందారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story