- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BJP : ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రేపు శనివారం ఫలితాలు వెలువడనుండగా..త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉన్న తరుణంలో ఢిల్లీ(Delhi)లో బీజేపీ(BJP) జాతీయ స్థాయి కీలక సమావేశం సాగుతోంది. ఫలితాలను అనుసరించి మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలలో ప్రభుత్వాల ఏర్పాటుపై అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించి కార్యాచరణ ఖరారు చేయనున్నారు. అలాగే ఇప్పటికే ఆప్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడం మొదలుపెట్టినందునా ఢిల్లీలో బీజేపీ ఎన్నికల వ్యూహాలపై కూడా చర్చిస్తారు. పలు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులతో పాటు.. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై ఆ పార్టీ అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారు. అందులోభాగంగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పదాధికారులతో పాటు అన్ని రాష్ట్రాల్లోని పార్టీ అధ్యక్షులు, ఇతర అగ్రనేతలతో సమావేశం నిర్వహించారు. సంస్థాగత ఎన్నికల నిర్వహణ, దేశ వ్యాప్తంగా ఇప్పటికే సాగుతోన్న సభ్యత్వ నమోదు, బూత్ స్థాయి నుంచి మండల, జిల్లా కమిటీలు ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
జాతీయ అధ్యక్షుడి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఇప్పటికే కేంద్ర ఎన్నికల అధికారి కె. లక్ష్మణ్ జాతీయ అప్పీల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి రాధామోహన్ సింగ్ కన్వీనర్‌గా, ముగ్గురు సీనియర్ బీజేపీ నేతలు విజయపాల్ సింగ్ తోమర్, సంజయ్ భాటియా, గజేంద్ర పటేల్‌లను నేషనల్ అప్పీల్ కమిటీ కో-కన్వీనర్‌లుగా నియమించారు. బీజేపీ అధ్యక్షుడి ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఈ అప్పీల్ కమిటీ విధులు నిర్వహిస్తుంది. జనవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశమున్న దృష్ట్యా అప్పటికల్లా కొత్త అధ్యక్షుడి నియామక ప్రక్రియ పూర్తి చేయాలనే టార్గెట్ తో బీజేపీ అధినాయకత్వం ఉంది.
ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం గత ఏడాది డిసెంబర్‌తో ముగిసింది. కానీ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఆయన పదవీకాలాన్ని జూన్ 30 వరకు పొడిగించారు. ఆ తర్వాతా ఆయన్నే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ఆరోగ్య మంత్రిగా ,రాజ్యసభ పక్షనేతగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం ఆరు నెలల నుంచి వివిధ పేర్లపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇందులో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితో పాటు సీనియర్ నేతలు శివరాజ్‌సింగ్ చౌహాన్ , సునీల్ భూపేంద్ర యాదవ్ , దేవేంద్ర ఫడ్నవీస్ , ధర్మేంద్ర ప్రధాన్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
కర్ణాటకలో తిరిగి అధికారం చేజిక్కించుకోవడం సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో పార్టీని మరింత విస్తరించాలని భావిస్తున్న బీజేపీ.. దక్షిణాది రాష్ట్రాల నుంచే అధ్యక్షుడిని ఎంపిక చేస్తుందని బలమైన ప్రచారం జరుగుతోంది.
బీజేపీలో మొదట బూత్, ఆ తర్వాత మండల, ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారు. ఎన్నికల అధికారులు ప్రకటించే తేదీల్లో బూత్, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడి ఎన్నికతో పాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడి ఎన్నిక కూడా నిర్వహిస్తారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకోవాలి. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాష్ట్రాల అధ్యక్షుడిని ఎన్నుకోనుండగా, జాతీయ కౌన్సిల్ సభ్యులు జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 2 నెలల సమయం.. అంటే డిసెంబర్ రెండో వారానికి పూర్తవుతుందని...ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.