ముంచుకొస్తున్న ‘బిపర్జాయ్’

by Javid Pasha |
ముంచుకొస్తున్న ‘బిపర్జాయ్’
X

న్యూఢిల్లీ: ‘బిపర్జాయ్’ తుఫాను ముంచుకొస్తోంది. గురువారం సాయంత్రం గుజరాత్ లోని జకావు పోర్ట్ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో గుజరాత్ లోని సౌరాష్ట్ర, కచ్ తీరాలకు, రాజస్థాన్ కు మంగళవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాను ప్రభావం రాజస్థాన్ లోనూ 12 జిల్లాల్లో తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. 15, 16, 17 తేదీల్లో గుజరాత్ లోని సౌరాష్ట్ర, కుచ్ సహా 8 జిల్లాల్లో, రాజస్థాన్ లోని బికనీర్, పాలి, సిరోహి, బన్స్ వారా, దుంగార్ పూర్, ఉదయ్ పూర్, సిరోహి, జలోర్, బార్మర్, జైసల్మేర్, జోధ్ పూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది. దీంతో లోతట్టు ప్రాంతాల నుంచి 21 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొన్ని రైళ్లను పాక్షికంగా, మరికొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.

గుజరాత్ సీఎంకు ప్రధాని ఫోన్

గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ ‘బిపర్జాయ్’ తుఫాను పరిస్థితి గురించి తెలుసుకున్నారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. తుఫాను పరిస్థితిపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, విద్యుత్తు, టెలికమ్యూనికేషన్స్, ఆరోగ్యం, తాగునీరు తదితర సేవలకు ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, తుఫాను ప్రభావిత 8 జిల్లాల ఎంపీలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా పరిస్థితిని సమీక్షిస్తోంది.

Advertisement

Next Story