Bangladesh Protests: షేక్ హసీనా రాజీనామా.. సైన్యం చేతుల్లోకి పాలన

by Shamantha N |
Bangladesh Protests: షేక్ హసీనా రాజీనామా.. సైన్యం చేతుల్లోకి పాలన
X

దిశ, నేషనల్ బ్యూరో: హింసాత్మక ఘటనలో పొరుగుదేశమైన బంగ్లాదేశ్ అట్టడుకుతోంది. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంమవుతోంది. అయితే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేశారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆర్మీ రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్‌ ఆర్మీ చీఫ్‌ వాకర్‌-ఉజ్‌-జమాన్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ బాధ్యతను తన చేతుల్లోకి తీసుకున్నట్లు ఆర్మీ చీఫ్ వెల్లడించారు. హింసకు ముగింపు పలకాలని ప్రజలను కోరారు. దేశంలో శాంతిభద్రతల నిర్వహణ బాధ్యత సైన్యానిదేనని వెల్లడించారు.

దేశాన్ని వీడిన షేక్ హసీనా

మరోవైపు, అధికారిన నివాసాన్ని వీడి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఆందోళనలు ఉద్ధృతం కావడంతో పీఎం పదవికి రాజీనామా చేయడంతోపాటు దేశం విడిచి వెళ్లారని వెల్లడించింది. షేక్ హసీనా ఒక ప్రసంగాన్ని రికార్డ్ చేయాలనుకున్నప్పటికీ ఆ అవకాశం లభించలేదని పేర్కొంది. అయియితే, వీటిపై అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. బంగ్లా ప్రధాని హసీనా, ఆమె సోదరి రాజధాని ఢాకా నుంచి వేరే దేశానికి పారిపోయినట్లు తెలుస్తోంది. ఆర్మీకి చెందిన ప్రత్యేక హెలికాప్టర్‌లో దేశం విడిచి వెళ్లిపోయారని సమాచారం. అయితే, ఆమె భారత్‌కు వెళ్లిపోయారని కొన్ని మీడియా సంస్థలు చెబుతుండగా.. మరికొన్ని మాత్రం వేరే దేశం వెళ్లిపోయారనే చెబుతున్నాయి.

ఇప్పటివరకు 300 మంది మృతి

ఆదివారం జరిగిన ఘర్షణల్లో 100 మంది చనిపోగా.. ఇప్పటివరకు మొత్తం 300 మంది మరణించారు. దీంతో బంగ్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్‌ సామాజిక మాధ్యమాలపైనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. కానీ, వేల మంది నిరసనకారులు ఈ ఆంక్షలను ధిక్కరించారు. వీధుల్లో కవాతు చేశారు. ప్రధానమంత్రి అధికారిక నివాసమైన గణభాబన్‌ను ముట్టడించిన వేలాది మంది ఆందోళనకారులు.. అక్కడ విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలోనే ముందుజాగ్రత్త చర్యగా ఢాకా ప్యాలెస్‌ను వీడిన ప్రధానమంత్రి షేక్‌ హసీనా.. సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారు.

Advertisement

Next Story