‘ఇండియా’ కూటమికి ‘అయోధ్య’ టెన్షన్.. ఎందుకు ?

by Hajipasha |   ( Updated:2024-01-05 18:15:44.0  )
‘ఇండియా’ కూటమికి ‘అయోధ్య’ టెన్షన్.. ఎందుకు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇంకో రెండు వారాల తర్వాత (జనవరి 22న) అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జరగబోతోంది. దీన్ని బీజేపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ అంశాన్నే ఎన్నికల వేళ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామనే స్పష్టమైన సంకేతాలను మోడీ సేన పంపుతోంది. రామమందిరం నిర్మాణం తమ ఘనతే అని చెప్పుకునే వ్యూహంతో కమలదళం పావులు కదుపుతోంది. దీంతో విపక్ష కూటమి ‘ఇండియా’ టెన్షన్‌‌కు లోనవుతోంది. ఈవిషయంలో ఎలా స్పందించాలో తెలియక.. శివసేన (ఉద్ధవ్) మినహా మిగతా విపక్ష పార్టీలన్నీ డైలమాలో పడ్డాయి. సున్నితమైన ఈ అంశంపై విమర్శలు చేస్తే.. మెజారిటీ హిందువుల మనోభావాలు దెబ్బతిని, తమ పార్టీల రాజకీయ అస్తిత్వాలు సంకటంలో పడతాయనే ఆందోళన ఇండియా కూటమి పార్టీలను ఆవరించింది. అందుకే రామమందిరంతో బీజేపీకి ముడిపెట్టి విమర్శలు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని అవి భావిస్తున్నాయి.

కాంగ్రెస్‌కు ఉద్ధవ్ థాక్రే సలహా ఇదీ..

కాంగ్రెస్ పార్టీ తరఫున అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లాలా వద్దా అనే దానిపై ఇంకా సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే ఎలాంటి నిర్ణయాన్ని కూడా ప్రకటించలేదు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న శివసేన (ఉద్ధవ్) చీఫ్ ఉద్ధవ్ థాక్రే మాత్రం అయోధ్య కార్యక్రమానికి వెళ్లాలని సోనియాగాంధీకి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘‘కాంగ్రెస్ ఆత్మ హిందువు. ఆ విషయాన్ని దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది ? రామమందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు వెళితే తప్పేంటి ?’’ అని ఉద్ధవ్ థాక్రే ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం. ఈనేపథ్యంలో జనవరి 30 నుంచి సార్వత్రిక ఎన్నికల ఉమ్మడి ప్రచారానికి ఇండియా కూటమి తెర తీయనుంది. ఎన్నికల ప్రచారం ఎలా సాగాలి ? ఎక్కడెక్కడ సభలు, రోడ్ షోలు జరగాలి ? ఏయే అంశాలను జనంలోకి తీసుకెళ్లాలి ? అనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇటీవల కొందరు కీలక విపక్ష నేతల ప్రసంగాలను బట్టి ఒక విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. అదేమిటంటే.. ఎన్నికల ప్రచారంలో ఇండియా కూటమి ప్రధాన అస్త్రాలుగా సంక్షేమ ఎజెండా, ఉచిత పథకాలు ఉండొచ్చు. ప్రధాని మోడీ నాయకత్వం, హామీలకు గ్యారంటీ అనేవి బీజేపీ ప్రచార అస్త్రాలుగా నిలిచే ఛాన్స్ ఉంది.

Advertisement

Next Story