అయోధ్య దీపోత్సవం కొత్త రికార్డు..

by Vinod kumar |
అయోధ్య దీపోత్సవం కొత్త రికార్డు..
X

లక్నో : అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం జరిగింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో దీపావళిని పురస్కరించుకుని ఏకకాలంలో రికార్డు స్థాయిలో దీపాలను వెలిగించడం ద్వారా అయోధ్య నగరం శనివారం సాయంత్రం సరికొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించింది. సొంత రికార్డును తిరగరాస్తూ సరయూ నదీ తీరంలోని 51 ఘాట్‌లలో 22.23 లక్షల దీపాలను ఏకకాలంలో వెలిగించారు. దీంతో ఘాట్‌లన్నీ దివ్వెల కాంతులతో ధగధగా మెరిసిపోయాయి. దీపోత్సవ్‌లో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సరయూ ఘాట్ వద్ద ‘హారతి’ ఇచ్చారు. ముఖ్యమంత్రితో పాటు అయోధ్య ఈవెంట్‌లో గవర్నర్ ఆనంది బెన్ పటేల్ పాల్గొన్నారు. దీనికి ముందు రామ్ కథా పార్క్‌లో జరిగిన కార్యక్రమంలో రాముడు, సీత, లక్ష్మణ వేషధారులను సీఎం సత్కరించి ఆశీస్సులు అందుకున్నారు.


రామాయణం థీమ్‌తో అలంకరించిన 18 శకటాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. రామచరితమానస్, మానవ హక్కులు, కనీస విద్య, మహిళా భద్రత, సంక్షేమ వంటి అంశాలను ప్రతిబింబించే కళారూపాలను ప్రదర్శించారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం 2024 జనవరి 22న జరుగనుండగా, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరుకానున్నారు. కాగా, యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 2017లో అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్యలో దీపోత్సవ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. 2017లో 51,000 దీపాలు, 2019లో 4.10 లక్షల దీపాలు, 2020లో 6 లక్షల దీపాలు, 2021లో 9 లక్షల దీపాలు, 2022లో 17 లక్షల దీపాలను వెలిగించారు. గత ఏడాది నాటి రికార్డును తిరగరాస్తూ ఈసారి 22.23 లక్షల దీపాలను వెలిగించారు.

Advertisement

Next Story