2024 ఎన్నికల్లో ఆప్ గెలిస్తే ఉచిత విద్యుత్, వైద్యం: అరవింద్ కేజ్రీవాల్ హామీలు

by S Gopi |
2024 ఎన్నికల్లో ఆప్ గెలిస్తే ఉచిత విద్యుత్, వైద్యం: అరవింద్ కేజ్రీవాల్ హామీలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే '10 హామీలను' అమలు చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. త‌మ ప‌ది హామీల్లో మొద‌టి గ్యారెంటీ దేశ‌వ్యాప్తంగా 24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రాయేన‌ని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రధానంగా ఉచిత విద్యుత్, మెరుగైన ఆరోగ్య సంరక్షణ వంటి హామీల ద్వారా పూర్తి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రకటించారు. 'బీజేపీ తన వాగ్దానాలలో ప్రతిసారి విఫలమైంది. కానీ తన హామీలకు ట్రాక్ రికార్డు ఉంది. కాబట్టి కేజ్రీవాల్ గ్యారెంటీనా, మోడీ గ్యారెంటీనా అనేది ప్రజలే నిర్ణయిస్తారని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో నిరంతర విద్యుత్ సరఫరా మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని, విప‌క్ష ఇండియా కూట‌మి అధికారంలోకి వ‌స్తే దేశంలోని పేద‌లంద‌రికీ 200 యూనిట్ల వ‌ర‌కూ ఉచిత విద్యుత్ అంద‌చేస్తామ‌ని కేజ్రీవాల్ తెలిపారు. 'పది హామీల్లో మొదటిది దేశంలో 24 గంటల విద్యుత్. దేశంలో 3 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది, కానీ మన వాడుతున్నది 2 లక్షల మెగావాట్లే. మన దేశం మరింత విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు. తాము ఢిల్లీ, పంజాబ్‌లలో చేసినపుడు దేశవ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేయవచ్చు. దేశ‌వ్యాప్తంగా పేద‌ల‌కు 200 యూనిట్ల‌ ఉచిత విద్యుత్ అందిస్తామ‌ని, దానికోసం రూ. 1.25 ల‌క్ష‌ల కోట్ల వ్య‌య‌మ‌వుతుంది. ఆ నిధుల‌ను తాము ఏర్పాటు చేయగలమని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

అలాగే, ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించేందుకు రూ. 5 లక్షల కోట్లు అవసరమవుతాయని, ఇందులో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెరిసగం ఖర్చు చేయగలవని చెప్పారు. ఇక దేశ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల మెరుగు కోసం రూ. 5 లక్షల కోట్లు కావాలన్నారు. దేశంలో ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి బాగాలేదు. కాబట్టి అందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ప్రతి గ్రామంలోనూ, ప్రాంతంలోనూ మొహల్లా క్లినిక్‌లను తెరుస్తాం. జిల్లా ఆసుపత్రిని మళ్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారుస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. మిగిలిన హామీల్లో చైనా నియంత్రణ నుంచి భారత భూమిని విముక్తం చేయడం, అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయడం, స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం రైతులకు కనీసం మద్దతు ధర, ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా వంటివి ఉన్నాయి.

Advertisement

Next Story