Preamble: ప్రవేశిక నుంచి సోషలిస్ట్, సెక్యులర్ పదాలను తొలగించాలని పిటిషన్.. తిరస్కరించిన సుప్రీంకోర్టు

by vinod kumar |
Preamble: ప్రవేశిక నుంచి సోషలిస్ట్, సెక్యులర్ పదాలను తొలగించాలని పిటిషన్.. తిరస్కరించిన సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యాంగ ప్రవేశిక (Preamble) నుంచి ‘సోషలిస్టు’ (Socialist), ‘సెక్యులర్’ (Secular) అనే పదాలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు(Supreme court) తిరస్కరించింది. ఈ పదాలను 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారని, రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంలో ఇవి భాగమని స్పష్టం చేసింది. రాజ్యాంగంలో ఈ పదాలను చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి (Subramanya swamy), న్యాయవాది విష్ణు శంకర్ జైన్ (Vishnu shanker jain), మరి కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పదాలను దేశంలో ఎమర్జెన్సీ సమయంలో ఆమోదించారని, ప్రజాభిప్రాయం లేకుండా వీటిని చేర్చారని పేర్కొన్నారు. కాబట్టి ఈ పదాలను తొలగించాలని కోరారు. దీనిపై సీజేఐ సంజీవ్ ఖన్నా (Sanjeev khanna), జస్టిస్ సంజయ్ కుమార్‌(Sanjay kumar)లతో కూడిన ధర్మాసనం నవంబర్ 22న విచారించి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈ పిటిషన్లను తోసిపుచ్చింది.

సోషలిస్ట్, సెక్యులర్ అనే రెండు పదాలను1976లో రాజ్యాంగ సవరణ (Amendment) ద్వారా ప్రవేశికలో చేర్చారని, రాజ్యాంగం1949లో ఆమోదించబడినప్పటికీ పరిస్థితిలో ఎటువంటి తేడా లేదని తెలిపింది. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని, దాని ఆధారంగానే ప్రవేశిక రూపొందిందని నొక్కిచెప్పింది. ఈ సవరణ అమలులోకి వచ్చిన దశాబ్దాలలో విస్తృతమైన న్యాయపరమైన పరిశీలన, శాసన ఆమోదం పొందిందని వెల్లడించింది. ఈ మేరకు పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం దీనిని వివరంగా విచారించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. రాజ్యాంగాన్ని దాని ప్రాథమిక లక్ష్యాల నుంచి వేరు చేసే ఏ ప్రయత్నమూ ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.

కాగా, 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ(Intigrity) అనే పదాలను చేర్చారు. ఈ సవరణ అనంతరం ప్రవేశికలో సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్రం నుంచి సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రంగా మారింది. స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 42వ సవరణను రూపొందించారు. ఈ సవరణతో భారత న్యాయవ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని కూడా పలువురు విశ్లేషకులు భావిస్తారు.

Advertisement

Next Story

Most Viewed