శరద్ పవార్‌ను కలిసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..

by Vinod kumar |
శరద్ పవార్‌ను కలిసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..
X

ముంబై: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ముంబైలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ వాపర్‌ను కలిశారు. పంజాబ్ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ కూడా ఆయన వెంట ఉన్నారు. అతిషి, రాఘవ్ చడ్డా సహా ఇతర పార్టీ నేతలు కూడా ఎన్సీపీ అధినేతను కలిశారు. కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రమే ముంబై చేరుకున్నారు. బుధవారం ఆయన శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉధ్ధవ్ థాక్రేను కలిశారు. కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్ చేస్తున్న పోరాటానికి మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి దేశవ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. సుప్రీం కోర్టుపై నమ్మకం లేకనే నరేంద్ర మోడీ ఆర్డినెన్స్‌ను తెచ్చారని కేజ్రీవాల్ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రం సీబీఐ, ఈడీ వంటి సంస్థలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో గ్రూప్-ఎ అధికారుల బదిలీ, పోస్టింగ్‌ల కోసం అథారిటీని రూపొందించడానికి గత శుక్రవారం కేంద్రం ఆర్డినెన్స్‌ను విడుదల చేసింది. ఇది ఒక కుట్రతో కూడిన ఆర్డినెన్స్ అని ఆప్ ప్రభుత్వం అంటోంది. ఢిల్లీలో పోలీసు, పబ్లిక్ ఆర్డర్, భూమి మినహా ఇతర సేవల నియంత్రణ అధికారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన వారం తర్వాత కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను తెచ్చింది. ఇది గ్రూప్-ఎ అధికారుల బదిలీ, క్రమశిక్షణా చర్యల కోసం నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీని ఏర్పాటు చేయాలని కోరుతోంది.

Advertisement

Next Story

Most Viewed