కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

by Y. Venkata Narasimha Reddy |
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్‌ కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నీట్‌ పరీక్షకు సిద్ధమవుతున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మీర్జాపూర్‌కు చెందిన 20 ఏళ్ల అశుతోష్‌ చౌరాసియా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అశుతోష్‌ కోటాలోని దాదాబరీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల ఓ హాస్టల్‌లో ఉంటూ నీట్‌ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. బుధవారం విద్యార్థి తల్లిదండ్రులు అతడికి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో.. వారు పీజీ యజమానికి సమాచారం అందించారు. అతను అశుతోష్‌ రూమ్‌ వద్దకు వెళ్లి తలుపు కొట్టగా.. ఎలాంటి స్పందనా లేకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గది తలుపులు బద్దలు కొట్టి చూడగా.. అశుతోష్‌ ఉరేసుకొని కనిపించాడు. విద్యార్థి మృతి సమాచారాన్ని వెంటనే అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన కోటాలో చదువుల ఒత్తిడి కారణంగా విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. అశుతోష్‌ ఘటనతో కలిసి ఈ ఏడాది కోటాలో 15మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్థులు బలన్మరణాల పాలయ్యారు. ప్రభుత్వాలు, విద్యాసంస్థలు విద్యార్థుల ఆత్మహత్యల నివారణ చర్యలు చేపట్టాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed