వాళ్లు వద్దు అంటే ఉన్నపళంగా అన్నీ ఆపేస్తా.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |
వాళ్లు వద్దు అంటే ఉన్నపళంగా అన్నీ ఆపేస్తా.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: నగరం మధ్యలో నుంచి నది ప్రవహించే నగరం దేశంలోనే లేదు.. అలాంటి హైదరాబాద్‌(Hyderabad) నగరం పాలకుల నిర్లక్ష్యంతో మురికి కూపంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. తాము మూసీకి పునరుజ్జీవనం అందిస్తాం.. మూసీ విషయంలో చరిత్ర హీనులుగా మిగలకూడదని మంచి ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. నదీగర్భంలో నివసిస్తున్న వారిపై ఆరు నెలల నుంచి అధికారులు సర్వే చేశారు. 1600 ఇళ్లు నదీగర్భంలో ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 33 మంది అధికారుల బృందం పనిచేసింది. మూసీ పరివాహక ప్రాంతం ప్రజలను ఆదుకోవడం ఎలా అనేదానిపై దృష్టి సారించాం. ప్రపంచంలో ఎక్కడ మేధావులు అవసరమైనా దేశం నుంచే ఎగుమతి చేస్తున్నాం.. కాంగ్రెస్ పార్టీ వల్లే ఇది సాధ్యమైందని అన్నారు.

దేశంలో సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) కారణమని తెలిపారు. కంప్యూటర్‌తో ఉద్యోగాలు, ఆదాయాలు పెరిగాయి.. కాంగ్రెస్ విజన్‌తోనే ఇది సాధ్యమైందని అన్నారు. అప్పటి ప్రధాని పీవీ నరసింహా రావు సరళీకృత విధానాలతో ప్రపంచంలోని దేశాలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి.. నెహ్రూ, రాజీవ్, పీవీ.. ముగ్గురు ప్రధానుల వల్ల దేశం అభివృద్ధి బాటలో నడిచిందని చెప్పుకొచ్చారు. చినుకు పడితే చాలు హైదరాబాద్ నగరం మొత్తం చిత్తడిగా మారుతోంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. వరదనీరు ఇళ్లలోకి వస్తోంది. ఈ కారణంగా ప్రజలు తరచూ ప్రభుత్వంపై మండిపడటం సాధారణంగా మారింది.

అలాంటి పరిస్థితి హైదరాబాద్‌కు మళ్లీ రాకూడదనే తాము ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇంతటి గొప్ప పనులు తాము చేస్తుంటే.. ప్రజల్లో అపోహలు సృష్టించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ సర్వనాశనం అవుతున్నా రాజకీయాలే ముఖ్యమయ్యాయా? అని విపక్షాలను ప్రశ్నించారు. దీనిపై అందరూ(ప్రజలు) ఒప్పుకుంటేనే ముందుకు వెళ్తామని అన్నారు. తాను కెప్టెన్ లాంటోడ్ని అని.. ప్లేయర్స్ వద్దు అంటే ఆపేస్తా అని కీలక ప్రకటన చేశారు.

Advertisement

Next Story