ఉమామహేశ్వరంలో కనువిందు చేస్తున్న జలపాతం

by Mahesh |
ఉమామహేశ్వరంలో కనువిందు చేస్తున్న జలపాతం
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లాలో గత మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అచ్చంపేట నియోజకవర్గంలోని రంగాపూర్ గ్రామ సమీపంలో నల్లమల్ల కొండపై వెలసిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం నందు గురువారం మధ్యాహ్నం భారీగా వర్షం కురిసింది. దీంతో క్షేత్రం కొండపై నుంచి జలపాతం కిందకు దూకుతుండటంతో.. జలపాతాన్ని తలపిస్తుంది. ఈ జలపాతాన్ని చూసేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. అటవీ కొండలనుంచి జాలువారుతున్న ఈ జలపాతాన్ని చూసిన భక్తులు మైమరచిపోతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రకృతి అందాలను తమ మొబైల్ ఫోన్లలో బంధిస్తూ తృప్తి పడుతున్నారు.

అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జలపాతం భారీగా వస్తున్న తరుణంలో కొండ చర్యలు విరిగి పడే అవకాశం ఉందని ఆలయానికి వచ్చిన భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున భక్తులు ఎవరు అతి ఉత్సాహం చూపకుండా జాగ్రత్త పడాలని ఆలయ చైర్మన్ మాధవరెడ్డి, ఈవో శ్రీనివాసరావు భక్తులకు సూచనలు చేస్తున్నారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆలయ సిబ్బందికి సూచించారు. ఆలయం వద్ద ఈవో శ్రీనివాసరావు, కమిటీ డైరెక్టర్లు పవన్ కుమార్, వాడకట్టు వినోద్, అర్చకులు, ఆలయ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed