Akal Takht : చెప్పులు శుభ్రం చేయండి.. గిన్నెలు కడగండి.. సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు ‘అకల్ తఖ్త్’ ఆదేశాలు

by Hajipasha |
Akal Takht : చెప్పులు శుభ్రం చేయండి.. గిన్నెలు కడగండి.. సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు  ‘అకల్ తఖ్త్’ ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : సిక్కు మతపెద్దల అత్యున్నత సంస్థ ‘అకల్ తఖ్త్’(Akal Takht) పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సంచలన ఆదేశాలు జారీ చేసింది. జతేదార్ గియానీ రఘ్బీర్ సింగ్ సహా మొత్తం ఐదుగురు మతపెద్దలతో కూడిన ఈ సిక్కు మత విభాగం శిరోమణి అకాలీ దళ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌(Sukhbir Singh Badal)కు ‘తన్ఖా’ (మతపరమైన శిక్ష) విధించింది. 2007 నుంచి 2017 వరకు శిరోమణి అకాలీ దళ్ అధికారంలో ఉన్న టైంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని సిక్కుల మతపరమైన భావనలకు విఘాతం కలిగించారనే అభియోగాలు నిరూపితం కావడంతో సుఖ్బీర్ సింగ్ బాదల్‌‌పై ఈమేరకు చర్యలు తీసుకున్నారు. ఆగస్టులోనే ఆయనను దోషిగా నిర్ధారించిన అకల్ తఖ్త్.. తాజాగా సోమవారం శిక్షను ప్రకటించింది.

తన్ఖా శిక్ష అమలులో భాగంగా సిక్కుల సంప్రదాయ చోలాను ధరించి పంజాబ్‌లోని వేర్వేరు గురుద్వారాల ఎదుట రెండు రోజులు చొప్పున గార్డ్ డ్యూటీ చేయాలని సుఖ్బీర్ సింగ్‌ను ‘అకల్ తఖ్త్’ ఆదేశించింది. ఇందుకోసం శ్రీ హరిమందార్ సాహిబ్ (గోల్డెన్ టెంపుల్), తఖ్త్ శ్రీ కేశ్ ఘర్ సాహిబ్, తఖ్త్ శ్రీ దాందామా సాహిబ్, దర్బార్ సాహిబ్ (ముక్త్ సర్), గురుద్వారా ఫతేఘర్ సాహిబ్‌లను సందర్శించాలని సూచించింది. ‘‘ఆయా గురుద్వారాల ఎదుట ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు కూర్చొని భక్తుల చెప్పులను శుభ్రం చేయాలి. అనంతరం లంగర్ హాల్‌లోకి వెళ్లి పాత్రలు, గిన్నెలను గంట పాటు కడగాలి’’ అని సుఖ్బీర్ సింగ్ బాదల్‌ను ‘అకల్ తఖ్త్’ ఆదేశించింది. ‘‘చేసిన తప్పును ఒప్పుకుంటున్నాను’’ అని రాసి ఉన్న పట్టీని మెడకు ధరించాలని ఆయనకు సూచించింది.

ప్రకాశ్ సింగ్ బాదల్‌కు ఇచ్చిన ‘ఫఖ్రే ఖౌమ్’ ఉపసంహరణ

శిరోమణి అకాలీ దళ్‌ అధ్యక్ష పదవికి సుఖ్బీర్ సింగ్ బాదల్‌ చేసిన రాజీనామాను ఆమోదించి, మూడు రోజుల్లోగా తమకు తెలియజేయాలని పార్టీ వర్కింగ్ కమిటీకి ‘అకల్ తఖ్త్’ నిర్దేశించింది. శిరోమణి అకాలీ దళ్ నూతన అధ్యక్షుడు, ఆఫీస్ బేరర్ల ఎన్నిక ప్రక్రియను ఆరు నెలల్లోగా పూర్తి చేసేందుకు ఒక కమిటీని నియమించాలని పార్టీ వర్కింగ్ కమిటీకి తెలిపింది. ఇక శిరోమణి అకాలీ దళ్ మాజీ నేత సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సాకు కూడా ‘అకల్ తఖ్త్’ స్వల్ప మార్పులు చేర్పులతో దాదాపు ఇదే విధమైన శిక్ష విధించింది. సుఖ్బీర్ సింగ్ బాదల్‌ తండ్రి, దివంగత మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్‌కు గతంలో ఇచ్చిన ‘ఫఖ్రే ఖౌమ్’ బిరుదును ఉపసంహరించుకుంటున్నట్లు అకల్ తఖ్త్ తెలిపింది. ప్రకాశ్ సింగ్ బాదల్ సీఎంగా ఉన్న టైంలో ‘డేరా సచ్చా సౌదా’ చీఫ్ గుర్మీత్ రాం రహీంకు క్షమాభిక్ష లభించింది. ఇందుకు ప్రకాశ్ సింగ్ కూడా సహకరించారని అకల్ తఖ్త్ విచారణలో తేలింది.

Advertisement

Next Story

Most Viewed