Israel- Hamas War: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఎయిరిండియా కీలక నిర్ణయం

by Shamantha N |
Israel- Hamas War: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఎయిరిండియా కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 8 వరకు ఇజ్రాయెల్ కు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటివరకు విమానాల రాకపోకలు జరగవని స్పష్టం చేసింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసకున్న వారిని వాటిని రద్దు చేసుకోవాలని సూచించింది. అందుకోసం సాయం కూడా చేస్తామంది. “ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ కు బయల్దేరే విమానాలను నిలిపివేశాం. విమానాల రద్దు తక్షణమే అమల్లోకి వస్తుంది. టెల్ అవీవ్ కు బుకింగ్ లు కూడా నిలిపివేశాం. ఇప్పటికే బుకింగ్స్ చేసుకున్న వారికి రీషెడ్యూల్, టికెట్ రద్దు గురించి సాయం కూడా చేస్తాం” అని ఎయిర్ ఇండియా సోషల్ మీడియాలో ప్రకటించింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు

గురువారం సాయంత్రం న్యూఢిల్లీ నుంచి టెల్ అవీవ్ వెళ్లాల్సిన విమానాన్ని ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఆపరేషనల్ కారణాలతో విమానం రద్దు చేసినట్లు ప్రకటించింది. ఇప్పుడేమో ఆగస్టు 8 వరకు విమానాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్, లెబనాన్, ఈజిప్ట్, సిరియా, జోర్డాన్ తో సహా అనేక దేశాల్లో 35 వేల మందికి పైగా మరణించారు. కాగా.. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాని దారుణంగా హత్య చేశారు. హనియా హత్యకు ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ ఆరోపించింది. ఇజ్రాయెల్ పై దాడి చేయాలని ఇరాన్ దేశ మతాధిపతి ఆయతుల్లా అలీ ఖమేనీ పేర్కొనడం గమనార్హం.

Advertisement

Next Story