20 గంటలు విమానం ఆలస్యం.. స్పృహ తప్పిన ప్రయాణికులు

by Harish |   ( Updated:2024-05-31 06:19:45.0  )
20 గంటలు విమానం ఆలస్యం.. స్పృహ తప్పిన ప్రయాణికులు
X

దిశ, నేషనల్ బ్యూరో: అసలే ఎండల వేడికి తట్టుకోలేకపోతున్న సమయంలో గంటల తరబడి ఏసీ లేకుండా విమానంలో కూర్చోవడం అంటే దారుణమే. అలాంటి సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం మధ్యాహ్నం 3.20 గంటలకు శాన్ ఫ్రాన్సిస్కో‌కు బయలుదేరాల్సిన AI 183 అనే ఎయిర్ ఇండియా విమానాన్ని సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ చేయలేకపోయారు. దీంతో దాదాపు 20 గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విమానం లోపల కనీసం ఏసీ కూడా వేయకపోవడంతో 8 గంటల తరువాత కొంత మంది స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే సిబ్బంది, ప్రయాణికులందరినీ విమానం నుంచి దించేశారు. ఇప్పటికే ఢిల్లీలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

బుధవారం నాడు రికార్డు స్థాయిలో 52.9 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో ఢిల్లీలో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. గురువారం కూడా వేడి గాలుల ప్రభావం అధికంగా ఉండటంతో విమానం లోపల కూర్చున్న ప్రయాణికులు భయంకరమైన ఉక్కబోత భరించాల్సి వచ్చింది. విమానం ఆలస్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రయాణికులు ఎయిర్‌ ఇండియా యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారిలో ఒకరు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. విమాన ఆలస్యంపై ఎయిర్‌ ఇండియా ప్రయాణికులను క్షమాపణలు కోరింది. సాధ్యమైనంత తొందరగా సమస్యను పరిష్కరిస్తామని ఒక ప్రకటనలో చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed