మహా కుంభమేళాలో AI టెక్నాలజీ.. యూపీ సీఎం కీలక ఆదేశాలు

by Harish |
మహా కుంభమేళాలో AI టెక్నాలజీ.. యూపీ సీఎం కీలక ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళా(2025)ను ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు, సాధువులు, పర్యాటకులు రానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, అలాగే రద్దీ దృష్ట్యా అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడడానికి యూపీ ప్రభుత్వం కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతికతలను, సాధనాలను ఉపయోగించాలని నిర్ణయించింది.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా 2025లో జరగబోయే మహా కుంభమేళాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మెగా ఈవెంట్‌కు AI టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, భద్రత, రద్దీ, పరిశుభ్రత, సౌకర్యాల పరంగా ఇబ్బందులు రాకుండా చూడడానికి ఏఐ సాధనాలను వాడుకోవాలని చెప్పారు. కుంభమేళా అనేది భారతదేశ గొప్ప మత, సాంస్కృతిక వారసత్వం. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, సమర్థంగా భక్తుల రద్దీని కంట్రోల్ చేయడానికి, దొంగతనాలు మొదలగు వాటిని జరగకుండా చూడటం కోసం AI- ఆధారిత పరికరాలు బాగా ఉపయోగపడుతాయి. ఈ సాంకేతికతలను అందిపుచ్చుకోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం యోగీ ఆదేశించారు.

ఈ మేళా యూపీ బ్రాండ్‌ను, బ్రాండ్ ఇండియాను పెంపొందించడానికి ఒక అవకాశంగా నిలుస్తుందని పేర్కొంటూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రొఫెషనల్ ఏజెన్సీలను నిమగ్నం చేయాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాత్రికులు, పర్యాటకులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రచారం చేయాలని సీఎం అధికారులకు చెప్పారు. గంగానది పరిశుభ్రతను కాపాడటానికి సంబంధిత శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఇంకా మేళా డ్యూటీ కోసం సిబ్బందికి శిక్షణ, అవగాహన కల్పించాలని యోగీ ఆదేశించారు.

సందర్శకులు, భక్తులతో ఎవరు కూడా అమర్యాదగా వ్యవహరించకూడదని, అంతర్జాతీయ వీఐపీ, వీవీఐపీ అతిథులకు తగిన ఏర్పాట్లు ఉండేలా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. మహా కుంభమేళా(2025) కోసం యాత్రికుల సౌకర్యార్థం 1.5 లక్షలకు పైగా మరుగుదొడ్లను మైదానంలో నిర్మించనున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది. ఈ మరుగుదొడ్లు పని చేసేలా చూసేందుకు 10,000 మందికి పైగా పారిశుధ్య కార్మికులు నిమగ్నమై ఉంటారని వారు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed