‘అగ్ని ప్రైమ్’ ప్రయోగం సక్సెస్..

by Vinod kumar |
‘అగ్ని ప్రైమ్’ ప్రయోగం సక్సెస్..
X

భువనేశ్వర్: రాత్రివేళ కూడా ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్ క్షిపణి "అగ్ని ప్రైమ్" పరీక్ష విజయవంతం అయింది. ఈ విషయాన్ని డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) వెల్లడించింది. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి అగ్ని ప్రైమ్ క్షిపణిని బుధవారం రాత్రి ప్రయోగించామని తెలిపింది. ఇదివరకు కూడా ఈ మిస్సైల్‌ను మూడుసార్లు పరీక్షించగా.. అన్నిసార్లు సక్సెస్ ఫుల్ అయింది. తాజా ప్రయోగం ద్వారా అగ్ని ప్రైమ్ క్షిపణి కచ్చితత్వం, విశ్వసనీయ తలను శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

వేర్వేరు ప్రాంతాల్లో రాడార్, టెలిమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి అగ్ని ప్రైమ్ ప్రయోగాన్ని పరిశీలించారు. రెండు డౌన్ రేంజి నౌకలు కూడా అగ్ని ప్రైమ్ గమన మార్గంపై కన్నేసి ఉంచాయి. ప్రయోగం విజయవంతం కావడంతో.. 2,000 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్స్‌ను ఛేదించగల అగ్ని ప్రైమ్‌ను సైన్యానికి అందించేందుకు మార్గం సుగమం అయింది. ఈ సందర్భంగా డీఆర్డీవో పరిశోధకులు, సాయుధ దళాలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. ఈ ప్రయోగంతో.. రాత్రివేళల్లోనూ దూసుకెళ్లగల అధునాతన క్షిపణి సాంకేతికతను భారత్ అందిపుచ్చుకున్నట్టయింది.

Advertisement

Next Story