ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ఇండియా బ్లాక్‌పై తీవ్ర ప్రభావం

by John Kora |
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ఇండియా బ్లాక్‌పై తీవ్ర ప్రభావం
X

- కాంగ్రెస్‌పై పెరుగుతున్న అసహనం

- మిత్రపక్షాల మధ్య పెరుగుతున్న విభేదాలు

- లోక్‌సభ ఎన్నికల తర్వాత సమావేశం కాని ఇండియా బ్లాక్

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం ఎన్డీయేకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. బీజేపీ ఒంటి చేత్తో ఢిల్లీని 27 ఏళ్ల తర్వాత కైవసం చేసుకొని మరింత బలమైన పార్టీగా మారింది. ఇక ఇండియా బ్లాక్‌లోని ఆప్, కాంగ్రెస్‌లు విడివిడిగా పోటీ చేసి కోరి ఓటమిని తెచ్చుకున్నాయి. ఓట్ల శాతం పరంగా చూస్తే.. ఆప్ కేవలం 2 శాతం ఓట్లతోనే అధికారం కోల్పోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా 6 శాతానికిపైగా ఓట్లు తెచ్చుకుంది. ఒక వేళ ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసి ఉంటే బీజేపీ మరోసారి ఢిల్లీలో పరాజయం పాలయ్యేది. అయితే ఢిల్లీ ఓటమికి ఇండియా కూటమి నేతలంతా కాంగ్రెస్‌నే దోషిగా చూపిస్తున్నాయి. ఇప్పటికే ఇండియా కూటమికి ఎవరు నేతృత్వం వహించాలన్న అంశంలో మిత్ర పక్షాల మధ్య విభేదాలు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీకి ఇండియా బ్లాక్ పగ్గాలు అప్పగించాలని గతంలోనే కేజ్రివాల్ డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో తన అభిప్రాయాన్ని మరింత బలంగా కూటమి నేతల మధ్య ఉంచే అవకాశం ఉంది.

ఇండియా కూటమిలోని ఆప్‌ను కాంగ్రెస్ నేరుగా టార్గెట్ చేయడం వల్లే ప్రజలు బీజేపీకి ఓటేశారని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఇలా ఎంత కాలం కొట్టుకుంటారంటూ జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా వ్యాఖ్యానించారు. బీజేపీ, ప్రధాని మోడీకి ప్రత్యామ్నాయం తీసుకొని వస్తామని ఏర్పాటు చేసిన ఇండియా కూటమి గత ఎనిమిది నెలల్లో కీలకమైన రాష్ట్రాల్లో ఓడిపోయింది. హర్యానా, మహారాష్ట్ర తాజాగా ఢిల్లీలో అధికారం కోల్పోయింది. ఇది తప్పకుండా కూటమి పార్టీల భవిష్యత్ ప్రణాళికలపై ప్రభావం చూపనుంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి ఇండియా కూటమి నేతలు సమావేశం కాలేదు. ఇక ముందు ఎప్పుడు సమావేవం అవుతారో కూడా తెలియదు. కీలకమైన బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇండియా కూటమిపై ఢిల్లీ ఎన్నికల ప్రభావం తప్పకుండా ఉంటుందని చెబుతున్నారు. ఢిల్లీ ఎన్నికల సమయంలో ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్‌లు ఆప్‌తో జతకట్టాయి. అదే సమయంలో కాంగ్రెస్‌ను ఒంటరిగా వదిలేశాయి. మరి బీహార్‌లో ఇండియా కూటమి వైఖరి ఎలా ఉండబోతోందో అర్థం కావడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా బ్లాక్‌లో విభేదాలను పక్కన పెట్టి.. స్పష్టమైన కార్యచరణ, వ్యూహాలను సిద్ధం చేయపోతే కూటమి లక్ష్యం నీరుగారిపోవడం ఖాయం.

Next Story