Election Commission : ఓటర్ల పోలింగ్ బూత్‌లు మార్చొద్దు.. ఈసీకి ఆప్ లేఖ

by Hajipasha |
Election Commission : ఓటర్ల పోలింగ్ బూత్‌లు మార్చొద్దు.. ఈసీకి ఆప్ లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి నుంచే ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈక్రమంలో ఢిల్లీ పరిధిలో 1500 మందికి మించి ఓటర్లున్న పోలింగ్ బూత్‌‌ల పరిధిలోని ఓటర్లను.. 1500 కంటే తక్కువ మంది ఓటర్లున్న పోలింగ్ బూత్‌ల పరిధిలోకి బదిలీ చేసేందుకు ఈసీ కసరత్తు మొదలుపెట్టింది. ఈ ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బుధవారం లేఖ రాసింది.

ఓటర్ల పోలింగ్ బూత్‌లను మార్చేందుకు సంబంధించిన ఆగస్టు 7న ఈసీ జారీ చేసిన నోటీసుపై ఆప్ ఆందోళన వ్యక్తం చేసింది. ఓటర్ల పోలింగ్ బూత్‌లను మార్చడం వల్ల పోలింగ్ రోజున వారు రవాణాపరమైన అసౌకర్యాన్ని ఎదుర్కొనే ముప్పు ఉంటుందని పార్టీ ఆరోపించింది. పోలింగ్ రోజున ఓట్లు వేయడానికి కేటాయించే 11 గంటల వ్యవధిలో సగటున 650 మందికిపైగా ప్రజలు ఓటు వేయడం అనేది దాదాపు అసాధ్యమని ఆప్ పేర్కొంది. ఒక్కో పోలింగ్ బూత్ పరిధిలో కాస్త ఎక్కువ మంది ఓటర్లున్నా పెద్దగా సమస్యేం ఉండదని తెలిపింది.

Advertisement

Next Story