రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. పార్టీకి 400 మంది కార్యకర్తల రిజైన్!

by samatah |
రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. పార్టీకి 400 మంది కార్యకర్తల రిజైన్!
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 400 మంది కార్యకర్తలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో పార్టీ సంక్షోభంలో కూరుకుపోయినట్టు సమాచారం. రాష్ట్రంలోని నాగౌర్ లోక్‌సభ స్థానంపై కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్‌పీ)తో పొత్తు పెట్టుకోవడంతోనే వారంతా అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. నాగౌర్‌ ఎంపీ, ఆర్‌ఎల్‌పీ చీఫ్‌ హనుమాన్‌ బేనివాల్‌ను కాంగ్రెస్‌ ఇక్కడ పోటీకి దింపింది. అంతేగాక ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి జ్యోతీ మిర్ధాకు అనుకూలంగా పలువురు కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేశారని బెనివాల్ కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే బెనివాల్ ఫిర్యాదు మేరకు ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలను ఆరేళ్లపాటు సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. సస్పెండ్ చేసిన వారిలో మాజీ ఎమ్మెల్యే భరరామ్, కుచేరా మున్సిపాలిటీ చైర్‌పర్సన్ తేజ్‌పాల్ మిర్ధా, సుఖరామ్ దొడ్వాడియాలు ఉన్నారు. సస్పెన్షన్‌ను నిరసిస్తూ ముగ్గురు కాంగ్రెస్ నేతలు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో నాగౌర్‌లోని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే వారికి మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ నేత వరుణ్ పురోహిత్ స్పందిస్తూ..కార్యకర్తలెవరూ రాజీనామా చేయలేదని, ఇదంతా బీజేపీ చేస్తున్న ప్రచారం మాత్రమేనని కొట్టి పారేశారు.

కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన తేజ్ పాల్ మీర్జా మీడియతో మాట్లాడుతూ..‘నాగౌర్‌లో కాంగ్రెస్‌ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న హనుమాన్ బెనివాల్ ప్రయత్నిస్తున్నాడు. అలాంటి వ్యక్తిలో పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అసంతృప్తికి లోనయ్యారు. అందుకే సామూహిక రాజీనామా లేఖ ఇస్తున్నాం’ అని తెలిపారు. స్థానిక కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అంగీకారం లేకుండానే కాంగ్రెస్ హైకమాండ్ ఆర్‌ఎల్‌పీతో పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకే ఆర్ఎల్‌పీ పనిచేస్తుందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed