బీహార్‌లో కూలిన మరో వంతెన.. వారంలోపే మూడవది

by Harish |
బీహార్‌లో కూలిన మరో వంతెన.. వారంలోపే మూడవది
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల బీహార్ రాష్ట్రంలో వరుసగా వంతెనలు కూలుతున్న ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా మోతిహారిలో నిర్మాణంలో మరో వంతెన కూలిపోయింది. దీంతో ఈ వారం వ్యవధిలోనే మూడు వంతెనలు కుప్పకూలడం గమనార్హం. మోతిహారిలోని ఘోరసహన్‌లో అంవా నుండి చైన్‌పూర్ స్టేషన్‌కు వెళ్లే రహదారిపై రూ.1.5 కోట్లతో నిర్మిస్తున్న 16 మీటర్ల పొడవైన వంతెన ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. జిల్లా పరిపాలన సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఇది తీవ్రమైన విషయం, శాఖాపరమైన విచారణకు ఆదేశించాం, దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని RWD అదనపు ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.

అయితే అక్కడి స్థానికులు మాత్రం బ్రిడ్జి పిల్లర్ల నిర్మాణం నాసికరంగా ఉండటం వలన ఈ ఘటన జరిగిందని అన్నారు. పోలీసులు కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే బీహార్ రాష్ట్రంలో వరుసగా వంతెనలు కూలడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇదే వారంలో శనివారం సివాన్ జిల్లాలో ఓ చిన్న వంతెన కూలిపోయింది. అంతకు ముందు మంగళవారం అరారియా జిల్లాలో 180 మీటర్ల పొడవున కొత్తగా నిర్మించిన వంతెన కూలిపోయింది.

Advertisement

Next Story

Most Viewed