Uttarakhand: లోయలో పడ్డ బస్సు.. 36 మంది మృతి

by Mahesh Kanagandla |
Uttarakhand: లోయలో పడ్డ బస్సు.. 36 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లో సోమవారం ఉదయం ఘోర(Road Accident) ప్రమాదం జరిగింది. 52 మంది ప్రయాణికులతో వెళ్లుతున్న బస్సు అదుపుతప్పి లోయలో(Gorge) పడిపోయింది. అల్మోరా జిల్లా(Almora Dist) మార్చులా ఏరియాలో జరిగిన ఈ దుర్ఘటనలో 36 మంది మరణించగా.. పదికి మించి ప్రయాణికులు గాయపడ్డారు. కొందరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే స్పాట్‌కు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌లో మునిగిపోయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అల్మోరా ఎస్పీ దేవేంద్ర పించా తెలిపారు.

దీపావళి తర్వాత ఫస్ట్ వర్కింగ్ డే కావడంతో బస్సు సామర్థ్యానికి మించిన ప్రయాణికులతో బయల్దేరింది. ఈ 42 సీటర్ బస్సు పౌరి జిల్లా నౌనిదందా నుంచి బయల్దేరి నైనితాల్‌లోని రామ్‌నగర్‌కు వెళ్లుతున్నది. మార్చులా ఏరియాకు వచ్చిన తర్వాత ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. లోయలోపడ్డ బస్సు దొర్లుకుంటూ ఓ చెట్టుకు తాకి ఆగిపోయింది. ఆ చెట్టుకు పది అడుగుల దూరంలోనే ఓ నది పారుతుండటం గమనార్హం. బస్సు అదుపు తప్పి లోయలో పడగానే చాలా మంది ప్రయాణికులు బస్సు నుంచి ఎగిరి బయటపడ్డారు. చాలా మంది స్పాట్‌లోనే మరణించగా.. మరికొందరు గాయాలతో ప్రాణాలు వదిలారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల పరిహారాన్ని పీఎం ప్రకటించారు. ఘటనపై మెజిస్ట్రియల్ దర్యాప్తు జరపాలని ఆదేశించిన సీఎం.. ఆ రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడినవారికి రూ. 1 లక్ష పరిహారాన్ని ప్రకటించారు.

Advertisement

Next Story