Uttarakhand: భారీ వర్షాల వల్ల 14 మంది మృతి.. 10 మందికి గాయాలు

by Shamantha N |
Uttarakhand: భారీ వర్షాల వల్ల 14 మంది మృతి.. 10 మందికి గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్ ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా 14 మంది మరణించారు. బుధవారం సాయంత్రం నుండి కురిసిన వర్షాల వల్ల 14 మంది మరణించారని అధికారులు తెలిపారు. డెహ్రాడూన్‌లో నలుగురు, హరిద్వార్‌లో ఆరుగురు, తెహ్రీలో ముగ్గురు, చమోలీలో ఒకరు చనిపోయినట్లు పేర్కొన్నారు. మరో పదిమంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్ యాత్రను అధికారులు నిలిపివేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య యాత్రను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ట్రెక్ మార్గం ఘోరపరావ్, లించోలి, బడి లించోలి, భీంబాలి వద్ద కొండచరియలు విరిగిపడ్డట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 425 మంది యాత్రికులను లించోలి, భీంబాలి నుండి హెలికాప్టర్లలో సురక్షితంగా తీసుకువచ్చారు. కాగా.. 1,100 మంది యాత్రికులు రెస్క్యూ బృందాల సహాయంతో వివిధ ప్రాంతాల నుండి కాలినడకన సోన్‌ప్రయాగ్‌కు చేరుకున్నారని పోలీసులు తెలిపారు.

కేదార్ వ్యాలీలో వాయుసేన సేవలు

ఉత్తరాఖండ్ అధికారులతో కలిసి కేదార్ వ్యాలీలో వాయుసేన సహాయకచర్యలు కొనసాగిస్తోంది. రెస్క్యూ ఆపరేషన్లలో రెండు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు పాల్గొంటున్నాయి. చినూక్, MI 17 హెలికాప్టర్లను ఉత్తరాఖండ్ కు పంపినట్లు రక్షణశాఖ తెలిపింది. మూడు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ట్యాంకర్లను కూడా పంపామని పేర్కొంది. అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి హామీ ఇచ్చినట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. ఉత్తరాఖండ్ పరిస్థితిని జేపీ నడ్డా సమీక్షించారు.

ఉత్తరాఖండ్ సీఎం

అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం పుష్కర్ సింగ్ ధామి కోరారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు చోట్ల జనజీవనం అస్తవ్యస్తమైందని అన్నారు. రెస్క్యూ టీంలు రాత్రంతా చర్యలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రదేశానికి తరలించాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉత్తరాఖండ్ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్‌కు చేరుకుని వర్షం పరిస్థితిని సమీక్షించారు. జిల్లా మేజిస్ట్రేట్ లతో తసమన్వయం పాటించాలని డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్యదర్శిని ఆదేశించారు.

కేదార్ నాథ్ యాత్రికుల కోసం హెచ్చరికలు

ఇంతలో, రుద్రప్రయాగ్ కు చేరుకున్న కేదార్‌నాథ్ యాత్రికుల కోసం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, రోడ్డు బ్లాక్ లు ఉన్నందు వల్ల అధికారికంగా తెలియజేసే వరకు ఎక్కడున్నారో అక్కడే వేచి చూడాలని కోరారు. రుద్రప్రయాగ జిల్లాలో మందాకిని, అలకనంద నదులు ప్రమాదకర స్థాయికి చేరువలో ప్రవహిస్తున్నాయి.

Advertisement

Next Story