'న్యూట్రల్ పార్టీల.. రూటు సెపరేటు..?' కూటములకు దూరంగా 11 పార్టీలు

by Vinod kumar |
న్యూట్రల్ పార్టీల.. రూటు సెపరేటు..? కూటములకు దూరంగా 11 పార్టీలు
X

న్యూఢిల్లీ : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అమీతుమీకి రెండు రాజకీయ కూటములు రెడీ అయ్యాయి. 38 పార్టీలు అధికార ఎన్డీఏ కూటమిలో చేరగా.. 26 పార్టీలు విపక్ష కూటమి "ఇండియా"లో జాయిన్ అయ్యాయి. అయితే 11 పార్టీలు మాత్రం ఈ రెండు కూటములకు దూరంగా ఉండిపోయాయి. ఇలా న్యూట్రల్‌గా ఉండిపోయిన పార్టీల లిస్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ సీపీ), బిజూ జనతాదళ్ (బీజేడీ), భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), మజ్లిస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, శిరోమణి అకాలీదళ్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్), జనతాదళ్ (సెక్యులర్), రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ), శిరోమణి అకాలీదళ్ (అమృత్ సర్) ఉన్నాయి. ఎన్డీఏ, ఇండియా కూటములకు సమదూరం పాటిస్తున్న ఈ రాజకీయ పక్షాలకు మొత్తం 91 మంది లోక్ సభ సభ్యులు ఉన్నారు. ఇప్పటికైతే న్యూట్రల్‌గా ఉంటున్నా.. ఎన్నికలు సమీపించే నాటికి ఈ పార్టీలు వైఖరిని ఎలా మార్చుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ, ఇండియా కూటములపై ఈ పార్టీల ప్రస్తుత వైఖరేంటి..? ఇవి ఎందుకు న్యూట్రల్‌గా మిగిలాయి..? ఒకసారి చూద్దాం..

వైఎస్సార్ సీపీ ఓపెన్ ఆప్షన్.. టీడీపీ డైలమా..?

ఏ కూటమి గూటిలోనూ చేరని ఈ 11 న్యూట్రల్ పార్టీల్లో.. తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా పనిచేసే వైఎస్సార్ సీపీ, టీడీపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కూడా ఉన్నాయి. లోక్ సభలో వైఎస్సార్ సీపీకి 22 మంది, బీఆర్ఎస్ కు 9 మంది, టీడీపీకి ముగ్గురు, మజ్లిస్ పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని రాజకీయ సమీకరణాలు ఇతర రాష్ట్రాల కంటే పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీకి క్యాడర్ ఉన్నప్పటికీ.. వైఎస్సార్ సీపీ, టీడీపీ, బీఆర్ఎస్‌లకు ఉన్నంత క్యాడర్ లేదు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఆచూకీ గల్లంతైనంత పనైంది. 2019 అసెంబ్లీ పోల్స్ లో బంపర్ మెజార్టీతో విజయ ఢంకా మోగించిన వైఎస్సార్ సీపీ.. ప్రస్తుతానికి రాష్ట్ర స్థాయిలో తమకు పొత్తులు అక్కరలేదనే అభిప్రాయంతో ఉన్నట్టు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగం కాకున్నా జాతీయ స్థాయిలో బీజేపీకి చనువుగా మసులుకుంటూ.. పార్లమెంటులో బిల్లుల ఆమోదంలో కేంద్ర ప్రభుత్వానికి నిత్యం అండగా నిలుస్తోంది ఏపీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ.

అయితే భవిష్యత్తులోనూ కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి వచ్చినా బయటి నుంచి దానికి ఇలాగే మద్దతునిస్తూ సఖ్యతను పాటించాలనే వైఖరితో వైఎస్సార్ సీపీ ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈనేపథ్యంలో ఇటీవల ఎన్డీఏ కూటమి భేటీకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీకి ధీటైన పోటీ ఇస్తున్న టీడీపీ మాత్రం న్యూట్రల్ గా ఉండిపోయింది. దీంతో పొత్తులపై టీడీపీ వైఖరి ఏమిటి..? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ వ్యతిరేక కూటములు, బీజేపీ నేతృత్వంలోని కూటములు రెండింటిలోనూ భాగస్వామిగా పనిచేసిన అనుభవం టీడీపీకి ఉంది. ఈనేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లోపు బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి ఆహ్వానం అందితే టీడీపీ ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. ఒకవేళ ఎన్డీఏ గూటిలో చేరేందుకు చంద్రబాబు నాయుడు ఓకే చెబితే.. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వైఎస్సార్ సీపీని ఉమ్మడిగా ఎదుర్కొంటాయి.

బీఆర్ఎస్, మజ్లిస్.. జాతీయ స్థాయిలోనూ చెట్టపట్టాల్..?

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ పాత పేరు టీఆర్ఎస్. జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించే లక్ష్యంతోనే దాని పేరును బీఆర్ఎస్‌గా మార్చారు. అందుకే ఈ పార్టీ అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండింటికీ సమదూరం పాటిస్తోంది. రాజకీయ సమీకరణాల ప్రాతిపదికన రెండు పార్టీలను కూడా నిత్యం బీఆర్ఎస్ విమర్శలతో టార్గెట్ చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ క్యాడర్ మునుపటి కంటే ఇప్పుడు మంచి ఫామ్‌లో యాక్టివ్‌గా ఉండటం బీఆర్ఎస్ అధినాయకత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. సొంతంగా విపక్ష కూటమి ఏర్పాటుకు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్రై చేశారు.

అయితే ఆ తర్వాత ఆయన కూటమి ఏర్పాటు ప్రయత్నాలను ఆపేసి.. పార్టీ విస్తరణకే ఫోకస్‌ను పరిమితం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులపై కేంద్ర దర్యాప్తు సంస్థల రైడ్స్, కర్ణాటక ఎన్నికలో కాంగ్రెస్ విజయం నేపథ్యంలో ఇటీవల బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభల్లో కాంగ్రెస్ టార్గెట్‌గా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగాలు సాగాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉన్నందున ఫ్యూచర్ లోనూ విపక్ష కూటమి వైపుగా బీఆర్ఎస్ వెళ్లే అవకాశం లేదు. మైనార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లకుండా చూసుకునేందుకుగానూ.. ఎన్డీఏ తో చేతులు కలిపే రిస్క్‌ను కూడా బీఆర్ఎస్ తీసుకోకపోవచ్చు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ కూడా బీఆర్ఎస్‌తోనే కలిసి నడిచేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే మజ్లిస్ పార్టీకి వివిధ రాష్ట్రాల్లో క్యాడర్ ఉంది. వచ్చే లోక్ సభ పోల్స్‌లో బీఆర్ఎస్, మజ్లిస్ కలిసికట్టుగా ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.

బీఎస్పీ.. ఒంటరి పోరుకు రెడీ..

దేశంలోనే అత్యధికంగా 80 ఎంపీ స్థానాలున్న రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. అక్కడ ఎంతో బలమైన పార్టీ.. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ). దీనికి ప్రస్తుతం 10 మంది ఎంపీలు ఉన్నారు. యూపీకి చెందిన సమాజ్ వాదీ పార్టీ విపక్ష కూటమి "ఇండియా"లో చేరిపోయింది. అంటే వచ్చే లోక్ సభ పోల్స్ లో కాంగ్రెస్, సమాజ్ వాదీ కలిసి బరిలోకి దిగుతాయి.

ఈ తరుణంలో ప్రస్తుతానికి బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి ఏ కూటమి వైపు కూడా మొగ్గు చూపలేదు. కానీ ఇటీవల కాలంలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె వైఖరిని అద్దం పడుతున్నాయి. విపక్ష కూటమిని.. అందులో ఉన్న పార్టీలను ఆమె సూటిగా విమర్శించారు. యూసీసీ బిల్లు మంచిదే.. కానీ దాన్ని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు తీసుకొస్తున్న తీరు సరిగ్గా లేదని ఇటీవల మాయావతి కామెంట్ చేశారు. ఈ లెక్కన వచ్చే ఎన్నికల్లో ఆమె ఒంటరిగానే బరిలోకి దిగుతారని క్లియర్ అయిందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

శిరోమణి అకాలీదళ్.. ఎన్డీఏకు దూరమైనా మళ్లీ దగ్గరయ్యే ఛాన్స్..!

సుఖ్బీర్ సింగ్ బాదల్ నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ పార్టీ తాజాగా జరిగిన ఎన్డీఏ మీటింగ్‌కు గైర్హాజరైంది. ఈ పార్టీకి పంజాబ్‌లో బీజేపీతో వచ్చిన గ్యాప్‌కు ఈ పరిణామం నిదర్శనం. బీజేపీతో పొత్తు పెట్టుకోమని ఇటీవల సుఖ్బీర్ సింగ్ బాదల్ స్పష్టం చేశారు. ఈ పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ప్రస్తుతం పంజాబ్ లో అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఆప్ అడుగులు ఇప్పుడు విపక్ష కూటమి వైపు పడ్డాయి. దీంతో ఆ వైపుగా శిరోమణి అకాలీదళ్ చూసే ఛాన్స్ లేదు. వచ్చే పోల్స్‌లో కలిసికట్టుగా బరిలోకి దూకనున్న కాంగ్రెస్, ఆప్‌లను ఒంటరిగా ఎదుర్కోవడం శిరోమణి అకాలీదళ్‌కు సాధ్యపడక పోవచ్చు. అందుకే ఎన్నికలు సమీపించే సమయానికి మళ్ళీ శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏ గూటికి చేరినా ఆశ్చర్యం లేదు.

బిజూ జనతాదళ్ (బీజేడీ).. అచ్చం వైఎస్సార్ సీపీ తరహా..!

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ). దీనికి 12 మంది ఎంపీలు ఉన్నారు. ఈ పార్టీ గత 25 సంవత్సరాలుగా ఒడిశాను పాలిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ సీపీ అనుసరిస్తున్న వైఖరికి బహుశా రోల్ మోడల్.. బిజూ జనతాదళ్ పార్టీయే అయి ఉండొచ్చని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతుంటారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సఖ్యతగా మసులుకుంటారనే పేరు నవీన్ పట్నాయక్‌కు ఉంది. ప్రస్తుతం ఆయనకు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే ఒడిశా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేడీ, బీజేపీ ప్రత్యర్థులుగా తలపడుతుంటాయి. బయట నుంచి కేంద్ర ప్రభుత్వాలకు మద్దతు ఇస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడమే తమ స్టాండ్ అని నవీన్ పట్నాయక్ తరుచూ చెబుతుంటారు.

ఏఐయూడీఎఫ్..

ఇక అస్సాం కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించే పార్టీ ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్). దీనికి 1 లోక్ సభ సభ్యుడు ఉన్నాడు. ఈ పార్టీకి ప్రధాన బలం మైనారిటీ ఓటు బ్యాంకు. ఇది ఎన్నికల సమయానికి విపక్ష కూటమి గూటికి చేరే అవకాశాలే ఎక్కువ. అస్సాంలో ఎంతో బలంగా ఉన్న బీజేపీని ఢీకొనేందుకు ఏర్పాటయ్యే విపక్ష కూటమి వైపు ఏఐయూడీఎఫ్ చూసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.

జనతాదళ్ (సెక్యులర్).. ఎన్డీఏ వైపే చూపు

ఇక మాజీ ప్రధాని దేవెగౌడ‌కు చెందిన జనతాదళ్ (సెక్యులర్) పార్టీ చూపు ఎన్డీఏ వైపే ఉంది. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్న ఈ పార్టీకి 1 ఎంపీ ఉన్నారు. ఇటీవల కాలంలో దేవెగౌడ కుమారుడు కుమారస్వామి కాంగ్రెస్ పార్టీని, విపక్ష కూటమిలోని పార్టీల నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ఇటీవల భేటీ అయి వచ్చినప్పటి నుంచి ఆయన విమర్శల వాడి మరింత పెరిగింది. ఈ చర్యల ద్వారా ఎన్నికల సమయానికి ఎన్డీఏ గూటికి తమ పార్టీ చేరడం ఖాయమనే సందేశాన్ని కుమారస్వామి జనంలోకి పంపుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ పోల్స్‌లో ఘోరంగా ఓడిపోయిన బీజేపీ కూడా తమకు జనతాదళ్ (సెక్యులర్) సపోర్ట్ కావాలని కోరుకుంటోంది.

Advertisement

Next Story

Most Viewed