100 కార్లు.. వందలమంది పోలీసులు వేటాడినా చిక్కడు.. దొరకడు

by Rajesh |   ( Updated:2023-03-31 09:01:52.0  )
100 కార్లు.. వందలమంది పోలీసులు వేటాడినా చిక్కడు.. దొరకడు
X

పంజాబ్​లో ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమం మళ్లీ ఊపందుకుందా..? పంజాబ్ మళ్లీ అల్లకల్లోలం దిశగా వెళ్తున్నదా..? 40 ఏళ్ల క్రితం ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వేర్పాటు వాదం మళ్లీ పడగ విప్పుతున్నదా? ‘సిక్కులకు ఖలిస్తాన్‌తోనే విముక్తి’ అంటూ ఓ 30 ఏళ్ల అమృత్​పాల్​సింగ్​ విసురుతున్న సవాల్​తో ఇప్పుడు దేశమంతా ఈ అంశంపైనే చర్చ జరుగుతున్నది. ఇంతకూ ఖలిస్తాన్ అంటే ఏంటి..? ఈ వేర్పాటు వాద ఉద్యమం ఎప్పుడు? ఎందుకు ప్రారంభమైంది..? ఈ అంశంపైనే ఈ వారం స్పెషల్​ స్టోరీ..

ఖలిస్తాన్ అంటే..

ఖల్సా అంటే పంజాబీ భాషలో పవిత్రమైనది. ఖలిస్తాన్ అంటే పవిత్ర భూమి. 18వ శతాబ్దంలో బ్రిటిష్ కబంద హస్తాల్లోకి భారత్ వెళ్లిపోక ముందు సిక్కుల సామ్రాజ్యం చాలా పెద్దది. ప్రస్తుతం భారత్‌లో ఉన్న పంజాబ్ గత సిక్కు సామ్రాజ్యంలో ఆరో వంతు మాత్రమే. మిగిలిన భూభాగమంతా ప్రస్తుత పాకిస్తాన్ లో ఉంది. ఆ దేశంలో కూడా పంజాబ్ ఓ రాష్ట్రంగా ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని పంజాబ్, భారత్‌లోని పంజాబ్, మరికొంత భూభాగాన్ని కలిపితే ఆనాటి సిక్కుల సామ్రాజ్యం ఏర్పడుతుంది.

1947 నుంచే ప్రత్యేక డిమాండ్..

ఆంగ్లేయులు 1947లో దేశ విభజన సమయంలో హిందువులకు భారత దేశం, ముస్లింలకు పాకిస్తాన్​ను పంచేశారు. అదే సమయంలో తమకూ సిక్కిస్తాన్ (ఖలిస్తాన్) ఇవ్వాలని సిక్కులు డిమాండ్ చేశారు. కానీ.. బ్రిటిష్ వాళ్లు దానికి ఒప్పుకోలేదు. పంజాబ్‌ను విడగొట్టి రెండు దేశాలకు పంచారు. సిక్కులకు స్వయం ప్రతిపత్తితో కూడిన స్వరాష్ట్రం ఇస్తానని నాటి ప్రధాని నెహ్రూ హామీ ఇచ్చారు. దీంతో సిక్కుల్లో చాలా మంది భారత్‌కు వచ్చేశారు.

తర్వాత ఆ హామీని నెరవేర్చకపోవడంతో నెహ్రూ తమను మోసం చేశారని సిక్కులు ఆగ్రహం చెందారు. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన జరిగినప్పుడూ పంజాబ్‌కు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్ వచ్చింది. లౌకిక దేశమైన భారత్‌లో భూభాగాన్ని మతపరంగా విభజించడం కుదరదని నెహ్రూ చెప్పడంతో ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమం ప్రారంభమైంది. పంజాబ్‌ను విడగొట్టడంలో నెహ్రూ హస్తం ఉందని సిక్కులు మండిపడ్డారు.

గురుద్వారాలపై పెత్తనం చెలాయించే ప్రబంధక్ కమిటీల్లో ఓటర్లుగా సిక్కులు కాని వారిని చేర్చడానికి నెహ్రూ 1959లో తీసుకొచ్చిన చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 1972లో ఏర్పాటైన శిరోమణి అకాళీదళ్ పార్టీలో ఏడాదిలోనే చీలికలు వచ్చాయి. రెండు వర్గాలుగా చీలిన పార్టీలోని పోరాటం క్రమంగా తీవ్రవాద స్థాయికి చేరుకుంది. ఒక వర్గానికి నాయకత్వం వహించిన జర్నయిల్​ సింగ్​ భింద్రన్​ వాలేను తొలుత కాంగ్రెస్ పార్టీ బలపరిచింది.

నాడు కేంద్ర హోం మంత్రిగా ఉన్న జైల్ సింగ్ అండతో భింద్రన్​వాలే వర్గం ఖలిస్తాన్ కోసం హింసాత్మక వైఖరిని అనుసరించారు. దీంతో శాంతియుత పద్ధతిలో ఖలిస్తాన్ సాధించాలన్న సిక్కులు ఆందోళన చెందారు. తర్వాత కాంగ్రెస్ దూరమవడంతో భింద్రన్​ వాలే విదేశీ సాయంతో రెచ్చిపోయాడు. 1971 యుద్ధంలో బంగ్లాదేశ్ ను కోల్పోయి ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్న పాకిస్తాన్ కు ఖలిస్తాన్ వేర్పాటువాదులు పావుగా కనిపించారు. జమ్మూకశ్మీర్, పంజాబ్ లను భారత్ నుంచి విడగొట్టాలన్న కుట్రతో పాక్ కు చెందిన ఐఎస్ఐ గూఢచారి సంస్థ నాటి నుంచి భింద్రన్​ వాలే నేతృత్వంలోని ఖలిస్తాన్ వేర్పాటువాదులు అస్త్రంగా మారారు.

స్వర్ణ దేవాలయంపై దాడి..

పాకిస్తాన్ అండతో ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమం తీవ్రవాద ఉద్యమంగా రూపుదాల్చింది. భింద్రన్​వాలే నేతృత్వంలో గురుద్వారాలను స్థావరంగా చేసుకున్న సిక్కుల సాయుధ దళాలు హింసాకాండకు పాల్పడుతూ ప్రజలను, భద్రతా దళాలను చంపే స్థాయికి చేరుకున్నారు. గురుద్వారాలను, స్వర్ణ దేవాలయాన్ని అతివాదులు ఆక్రమించుకున్నారు. వీరి అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోవడంతో పంజాబ్‌లో పరిస్థితి చేయిదాటి పోతోందన్న సమాచారంతో వేర్పాటువాదులను అణిచివేయాలని నాటి ప్రధాని ఇందిరాగాంధీ నిర్ణయించారు.

1984లో ఖలిస్తాన్ తీవ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో స్వర్ణ దేవాలయంపై సైనిక చర్యకు ఇందిరా గాంధీ ఆదేశించారు. ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ పేరుతో స్వర్ణ దేవాలయంలోకి చొరబడిన ఆర్మీ జవాన్లు జరిపిన విచక్షణా రహిత కాల్పుల్లో సామాన్య సిక్కులతో పాటు 492 మంది చనిపోయారు. తీవ్రవాదుల ఎదురు కాల్పుల్లో 83 మంది సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. 1592 మంది సిక్కులు పట్టుబడ్డారు. ఈ దమనకాండపై సిక్కుల్లో భారీ వ్యతిరేకత వచ్చింది. నాడు ఇందిరాగాంధీకి అంగరక్షకులుగా ఉన్న సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ ఏకంగా ప్రధానిపైనే కాల్పులు జరిపి చంపేశారు. అయితే.. తర్వాతి కాలంలో వేర్పాటువాద ఉద్యమం కనుమరుగైంది.

అమృత్ పాల్ సింగ్ ఎవరు..?

అమృత్ పాల్ సింగ్ రాకతో ఖలిస్తాన్ ఉద్యమం మళ్లీ ఊపందుకుంది. పంజాబ్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చేసినట్లు చెప్పుకుంటున్న అమృత్ పాల్.. జలంధర్ జిల్లాలోని జల్లుపుర్ ఖేరా గ్రామానికి చెందిన వాడు. అతడి కుటుంబం దుబాయ్‌లో ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం చేస్తున్నది. 2012లో దుబాయ్ వెళ్లిన అమృత్ పాల్ ఒక కార్గో కంపెనీలో ఆపరేషనల్ మేనేజర్‌గా పనిచేసినట్లు చెప్పుకున్నాడు. సిక్కుల ఐక్యత, సిక్కులకు ప్రత్యేక దేశం.. అంటూ సోషల్ మీడియా ద్వారా యువతలో క్రేజ్ సంపాదించాడు.

అమృత్ పాల్ సింగ్ 2022 ఆగస్టులో దుబాయ్ నుంచి భారత్ వచ్చాడు. తొలుత క్లీన్ షేవ్‌తో ఆధునికతను సంతరించుకున్న అమృత్ పాల్.. పంజాబ్ వచ్చిన తర్వాత తలపాగా, గడ్డంతో ఓ ఆధ్యాత్మిక సిక్కు మాదిరిగా మారిపోయాడు. ప్రముఖ నటుడు దీప్ సిద్ధూ చనిపోయిన తర్వాత ఆయన ప్రారంభించిన ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థకు అమృత్ పాల్ సింగ్ సారథిగా ప్రకటించుకున్నాడు. భింద్రన్ వాలే స్వస్థలమైన రోడ్ గ్రామంలో వేలాది మంది సిక్కుల సమక్షంలో అమృత్ పాల్ సింగ్ కు సారథ్య వేడుక జరిగింది. సిక్కుల సమస్యలకు ఏకైక పరిష్కారం ‘ప్రత్యేక దేశమే’ అని బహిరంగంగానే ప్రకటించిన అమృత్ పాల్ సింగ్ తన ప్రసంగాలతో బ్రిందన్ వాలాను గుర్తుకు తెస్తున్నాడు.

ఐఎస్ఐ శిక్షణ..

పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ డ్రోన్ల ద్వారా పంజాబ్‌లోని సరిహద్దుల్లో నిధులు, ఆయుధాలు విడిచిపెడుతూ అమృత్ పాల్ సింగ్‌కు అండగా నిలుస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. డ్రగ్స్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా ఆదాయం లభిస్తోందని అంచనా వేశాయి. పంజాబ్‌కు చెందిన ఖలిస్తాన్ నేత లఖ్ బీర్ సింగ్ రోడే సోదరుడు జస్వంత్, ఉగ్రవాది పరమ్ జీత్ సింగ్ పమ్మాతో పరిచయాలు పెంచుకున్న అమృత్ పాల్ సింగ్‌కు జార్జియాలో ఐఎస్ఐ శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆనంద్ పూర్ ఖల్సా ఫోర్స్ పేరుతో అమృత్ పాల్ సింగ్ ఒక ప్రైవేటు సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రధాన అనుచరుడు లవ్ ప్రీత్ తుఫాన్‌ను అరెస్టు చేసినప్పుడు వందలాది మంది సాయుధ అనుచరులతో ఏకంగా అజ్నాలా పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి విడిపించుకున్నాడు. ఈ ఘటనతో సైలెంట్‌గా ఉన్న ఖలిస్తానీ సానుభూతిపరుల మద్దతు సైతం పొందాడు.

విదేశాల్లోనూ ఆందోళనలు..

అమృత్ పాల్ సింగ్‌కు విదేశాల్లోనూ మద్దతుదారులు ఉన్నారు. అతడిని అరెస్టు చేయొద్దంటూ లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఖలిస్తాన్ మద్దతుదారులు తొలగించారు. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయంపైనా దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అక్కడి భారత్ జెండాను తొలగించారు. ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రాలోనూ పార్లమెంట్ భవనం ఎదుట నిరసనకు దిగారు. కెనడా, బ్రిటన్‌లోని హిందూ దేవాలయాలను ఖలిస్తాన్ మద్దతుదారులు ధ్వంసం చేశారు. ఖలిస్తాన్ కోసం కెనడాలో ఏకంగా రిఫరెండమే నిర్వహించారు. బ్రిస్బేన్‌లో భారత కాన్సులేట్ వద్ద ఖలిస్తాన్ జెండా ఎగురవేశారు.

Advertisement

Next Story

Most Viewed