ఎన్నికలకు ముందే 10 మంది బీజేపీ ఎమ్మెల్యేల విజయం.. ఎలా అంటే..?

by Swamyn |
ఎన్నికలకు ముందే 10 మంది బీజేపీ ఎమ్మెల్యేల విజయం.. ఎలా అంటే..?
X

దిశ, నేషనల్ బ్యూరో: అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 19న జరగనున్నాయి. వీటి ఫలితాలు లోక్‌సభ ఎన్నికలతోపాటే జూన్ 4న వెలువడనున్నాయి. ఈ నెల 20 నుంచి 27వరకు నామినేషన్లు స్వీకరించగా, శనివారంతో వాటి ఉపసంహరణ గడువు కూడా పూర్తయింది. పోలింగ్ జరగడానికి ఇంకా సమయం ఉంది. కానీ, ఆలోపే బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. సీఎం పెమా ఖండూ, ఆయన డిప్యూటీ చౌనా మెయిన్ సహా 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి పోటీగా ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. దీంతో ఆయా నేతలకు ఎదురులేకుండా పోయింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు సైతం శనివారంతో పూర్తవడంతో అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలి ఉంది. దీంతో రాష్ట్రంలో మొత్తం 60 స్థానాలకుగానూ బీజేపీ అప్పుడే 10 స్థానాలను గెలుచుకుంది. మరోసారి అధికారం చేపట్టడానికి ఇంకా 21 స్థానాలు మాత్రమే దక్కించుకోవాల్సి ఉంది. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన 10 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ శుభాకాంక్షలు తెలియజేసింది. ‘ఇది మోడీ గ్యారెంటీని, అరుణాచల్ ప్రదేశ్ ప్రజల తిరుగులేని మద్దతును, ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం పెమా ఖండూ నాయకత్వంపై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంద’ని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. ఇదిలా ఉండగా, అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పోటీ చేస్తున్నప్పటికీ కేవలం 34 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. కాగా, 2019 నాటి ఎన్నికల్లో బీజేపీ 41 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, జేడీయూతోపాటు ఇతర పార్టీలకు చెందిన మరో ఏడుగురు ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకున్నారు.



Advertisement

Next Story