ఒక్కరోజులోనే 6,654 కరోనా కేసులు

by sudharani |
ఒక్కరోజులోనే 6,654 కరోనా కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో :
దేశంలో కరోనా మహమ్మారి బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా రోజుకు 6 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతుండటం సాధారణమైపోయింది.శనివారం ఒక్కరోజే భారత్‌లో కొత్తగా 6,654 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో నమోదైన కేసుల్లో ఇదే ఇప్పటివరకు అత్యధికం. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,25,101కి చేరింది. ఒక్కరోజే 137మంది కరోనాతో మరణించగా, వైరస్ బారిన పడి ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 3,720 మందికి చేరింది. చికిత్స పొందుతూ నేటికి 51,783 మంది కోలుకోగా, యాక్టివ్ కేసులు 69,597 ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. దేశంలోనే ఇప్పటివరకు ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 2,608 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా రికార్డైన కేసులతో కలిపి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 47,910కి చేరింది. రాష్ట్రంలో గడిచిన 7 రోజులుగా 2వేలకు పైనే కొత్త కేసులు రికార్డవుతున్నాయి. రాజధాని ముంబైలో ఒక్కరోజే 1,566 పాజిటివ్ కేసులు వెలుగుచూడగా ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 28,634కు చేరింది. ముంబైలో శనివారం కరోనాతో 40 మంది మరణించారు. తమిళనాడులో ఒక్కరోజే 710 కొత్త కేసులు నమోదవగా, ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 15,512కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఒక్కరోజే ఐదుగురు మరణించడంతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 103కు చేరింది. తమిళనాడులో ప్రస్తుతం 7,915 యాక్టివ్ కేసులున్నాయి. గుజరాత్‌లో ఒక్కరోజే 396 కొత్త కేసులు నమోదు కాగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య13,669కి చేరింది. ఇప్పటివరకు ఇక్కడ వ్యాధి సోకి మొత్తం 829 మంది మరణించగా 6,169 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే కొత్తగా 47 కరోనా పాజిటివ్‌లు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ కేసుల సంఖ్య 2,561కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 727 యాక్టివ్ కేసులుండగా 1,778 మంది ఇప్పటివరకు డిశ్చార్జి అయ్యారు. ఇక్కడ కరోనాతో కొత్తగా ఒకరు మరణించగా, ఇప్పటివరకు వ్యాధి బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 56కు చేరింది. ఒక దశలో కేసులు పూర్తిగా తగ్గిపోతాయా అనిపించిన కేరళలో ఒక్కరోజే 62 కేసులు నమోదవడం రాష్ట్ర వాసులను కలవరపెడుతోంది. కొత్త కేసులతో కలిపి ఇక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 275కు చేరింది.

Advertisement

Next Story

Most Viewed