‘కంగారు’ పెట్టిస్తున్న నటరాజన్

by Shyam |
‘కంగారు’ పెట్టిస్తున్న నటరాజన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 2017లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు తరపున ఐపీఎల్‌కు పరిచయం అయిన లెఫ్ట్‌హాండ్ బౌలర్ నటరాజన్‌ ప్రస్తుతం ప్రపంచ దిగ్గజ క్రికెటర్ల ప్రశంసలు అందుకుంటున్నాడు. రూ.3 కోట్లకు సేహ్వాగ్ నేత‌ృత్వరంలోని పంజాబ్ జట్టు అతని ప్రతిభ చూసి కొనుగోలు చేసింది. అయితే సీజన్‌లో నటరాజన్ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో పంజాబ్‌ అతడిని వదులుకుంది. దీంతో 2018లో సన్‌రైజర్స్‌ కేవలం రూ.40 లక్షలకు కొనుగోలు చేసింది. నాటి నుంచి ఐపీఎల్‌‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో ఎట్టకేలకు టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. భారతజట్టుకు ఆడాలనుకున్న తన కోరికను మొక్కవోని దీక్షతో నెరవేర్చుకున్నాడు. ఐపీఎల్ 2020లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అద్భుతంగా రాణించిన నటరాజన్ ఆస్ట్రేలియా టూర్‌కు సెలక్టైన విషయం తెలిసిందే. అయితే ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో షమీ స్థానాన్ని భర్తీ చేసిన నటరాజన్‌.. అరంగేట్రం చేసిన కీలక మ్యాచ్‌లోనే మొదటి వికెట్ తీసి అందరి దృష్టినీ ఆకర్షించాడు.

అంతేగాకుండా శుక్రవారం కాన్‌బెర్రా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో అరంగేట్రం చేసిన నటరాజన్.. ఫస్ట్ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. వన్డేల్లో వరుస విజయాలతో ఊపుమీద ఉన్న ఆసీస్ ప్లేయర్లను కంగారు పెట్టించాడు. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేతో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన నటరాజన్.. 2 వికెట్లు, తొలి టీ20లో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. కాగా అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి టీమిండియాకు ఆడే అవకాశం దక్కించుకున్న నటరాజ్‌ ప్రయాణంపై క్రికెట్‌ దిగ్గజాలు సైతం అనేకమంది ప్రశంసలు కురిపిస్తున్నారు. తమిళనాడులోని సేలం సమీపంలోని చిన్నపంపట్టి గ్రామానికి చెందిన నటరాజన్‌‌ది పేద కుటుంబం. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. కనీసం పుస్తకాలు కూడా కొనుక్కోలేని స్థితిని ఎదుర్కొని అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్న ఆయన కోరికను నిజం చేసుకున్నాడు. చిన్న తనం నుంచే క్రికెట్‌పై ఆసక్తి ఉన్న నటరాజన్, బౌలింగ్‌పై కసరత్తు చేసి యార్కర్‌ కింగ్‌‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే అతడి బౌలింగ్‌ యాక్షన్‌పై విమర్శలు వెల్లువెత్తినా, నిరాశకు గురికాకుండా బౌలింగ్‌ యాక్షన్‌లో మార్పులు చేసుకుని సత్తా చాటాడు.

Advertisement

Next Story