3 నెలలకు ఒకసారి సుపథం టికెట్లు.. టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

by Ramesh Goud |   ( Updated:2025-03-24 11:47:44.0  )
3 నెలలకు ఒకసారి సుపథం టికెట్లు.. టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
X

దిశ, వెబ్ డెస్క్: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) అధ్యక్షతన అన్నమయ్య భవనంలో ప్రారంభమైన టీటీడీ పాలకమండలి సమావేశం (TTD Governing Council Meeting) ముగిసింది. ఈ సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థాన అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశానికి ముందు టీటీడీ విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (Garimella Balakrishna Prasad) మృతికి సంతాపం తెలుపుతూ పాలకమండలి సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జరిగిన సమావేశంలో దాదాపుగా 5,400 కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 30కు పైగా అజెండా ఆంశాలతో పాటు పలు కీలక ఆంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు.

ఈ సందర్భంగా రానున్న వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు అందించే సదుపాదాయలపైనా సభ్యులు చర్చ జరిపారు. ఇక ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆదేశాలకు అనుగుణంగా పలు కీలక‌ నిర్ణయాలు తీసుకున్నారు. అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్స్ కు కేటాయించిన భూమిని టీటీడీ స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నది. అలాగే జూపార్క నుంచి కపిల తీర్థం వరకు ప్రైవేట్ నిర్మాణాలు లేకుండా చేయాలని తీర్మానించారు. అంతేగాక తిరుమలలో లైసెన్స్ లేకుండా నడుపుతున్న దుకాణలను గుర్తించాలని, వాటిని వెంటనే ఖాళీ చేయించాలని తీర్మాణం చేశారు. విదేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు ప్రత్యేకమైన ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

అంతేగాక శ్రీవారి ఆస్తులు అన్యక్రాంతం కాకుండా‌‌ స్వామివారి స్థిరాస్తుల పరిశీలనపై కమిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాధనకు బోర్డు సభ్యులు ఓకే చెప్పారు. టీటీడీ లో విధులు నిర్వహించేవారు హిందువులు మాత్రమే అయ్యి ఉండాలన్న నిర్ణయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు. ఇక అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని, ఏపీలోని పలు పట్టణాలు, గ్రామాల్లో అర్థాంతరంగా ఆగిపోయి ఉన్న ఆలయ నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. టీటీడీలో శాశ్వత ఉద్యోగులకు 3 నెలలకు ఒకసారి సుపథం టికెట్లు ఇచ్చి స్వామివారి దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ వెల్లడించారు. ఈ సమావేశానికి చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ఈవో శ్యామల రావు, టీటీడీ బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సమావేశంపై టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ.. నాసిరకం ఆర్గానిక్ వస్తువులు పంపిణీ చేసే శ్రీనివాస సేవ సమితిని బ్లాక్ లిస్ట్ లో పెట్టామని తెలిపారు. పోటు కార్మికులకు 43 వేలు జీతభత్యాలు వచ్చేలా జీఎస్టీ ఉపసంహరణ కోసం తీర్మానం చేశామని అన్నారు. అంతేగాక సైన్స్ సిటీ కి ఇచ్చిన 20 ఎకరాలు వెనక్కు తీసుకున్నామని, కాంట్రాక్టు ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు ఓ కమిటీ నియమించి వారి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇక బ్రేక్ దర్శనం సమయం మార్పుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి రూ. 1 కోటి ఆర్ధిక సహాయం అందించాలని, టీటీడీ వసతి గృహాల అధినీకరించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. కొన్ని పాత భవనాలను కూల్చి వేసి నూతన భవన నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. బుకింగ్ విషయంలో గూగుల్ ఏఐ టెక్నాలజీ వినియోగించే విధంగా చర్యలు తీసుకుంటామని, దర్శనం టైం ను తగ్గించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఆస్ట్రేలియాలోని అడిలైట్ లో ఆగమ శాస్త్రం అనుసారం ఆలయం కడుతున్నారని, దీనికి సలహా ఇవ్వడం జరిగిందని, భక్తులందరికీ మంచి వసతి సౌకర్యాలు కల్పించేలా బోర్డు చర్యలు తీసుకుంటుందని చైర్మన్ వివరించారు.

Next Story

Most Viewed