Amazon India: తక్కువ ఖరీదైన వస్తువుల అమ్మకాలపై రెఫరల్ ఫీజు మాఫీ చేసిన అమెజాన్

by S Gopi |   ( Updated:2025-03-24 11:41:19.0  )
Amazon India: తక్కువ ఖరీదైన వస్తువుల అమ్మకాలపై రెఫరల్ ఫీజు మాఫీ చేసిన అమెజాన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా చిన్న వ్యాపారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కోటికి పైగా ఉత్పత్తులకు సంబంధించి రెఫరల్ ఫీజును ఫీజును(సెల్లర్ ఫీజు) తొలగిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఇది రూ. 300 కంటే తక్కువ విలువైన 135 విభాగాల్లోని ఉత్పత్తులకు వర్తిస్తుంది. ఫలితంగా 1.2 కోట్ల ఉత్పత్తులపై సెల్లర్ ఫీజు ఉండదని, ఈ నిర్ణయం ఏప్రిల్ 7వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకు అమెజాన్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుని తమ ఉత్పత్తులను విక్రయించినందుకు వ్యాపారుల నుంచి సంస్థ కొంత కమీషన్ తీసుకునేది. ఇది కేటగిరీలను బట్టి 2-16 శాతం మధ్య ఉంది. అమ్మకం ధరను బట్టి ఈ సెల్లర్ ఫీజు ఉంటుంది. ఉదాహరణకు రూ. 450కి ఒక వస్తువును విక్రయిస్తే, దాని రెఫరల్ ఫీజు 4 శాతం ఉంటే, అమెజాన్‌కు కమీషన్ రూపంలో వ్యాపారి రూ. 18 చెల్లించాలి. ఇదే సమయంలో రిఫరల్ ఫీజులను మినహాయించడంతో పాటు, అమెజాన్ అమ్మకందారులకు షిప్పింగ్ ఖర్చులను కూడా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ల ద్వారా జరిగే షిప్పింగ్ రేట్లను రూ. 77 నుంచి రూ. 65కి, వెయిట్ హ్యాండ్లింగ్ ఫీజును కిలోకు రూ. 17 వరకు తగ్గిస్తూ అమెజాన్ నిర్ణయం తీసుకుంది. ఒకే ఆర్డర్‌లో ఒకటి కంటే ఎక్కువ ఉత్పత్తులను షిప్పింగ్ చేసే వ్యాపారులు రెండో వస్తువుపై సెల్లింగ్ ఫీజును 90 శాతం వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. తక్కువ ధరకే ఎక్కువ ఉత్పత్తులను విక్రయించేందుకు అనువుగా ప్లాట్‌ఫామ్ ఉండాలనే లక్ష్యంతో ఈ ఫీజులను తగ్గించినట్టు అమెజాన్ ఇండియా డైరెక్టర్ అమిత్ నందా పేర్కొన్నారు.

Next Story

Most Viewed