మహిళల సింగిల్స్ ఫైనల్లో ఒసాక, బ్రాడీ

by Shiva |
మహిళల సింగిల్స్ ఫైనల్లో ఒసాక, బ్రాడీ
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో నయోమీ ఒసాక, జెన్నిఫర్ బ్రాడీ తలపడనున్నారు. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో సెరేనా విలియమ్స్‌ను 6-3, 6-4 తేడాతో ఓడించి ఫైనల్‌లోకి దూసుకొని వెళ్లింది. 2020 యూఎస్ ఓపెన్ చాంపియన్ అయిన వరల్డ్ నెంబర్ 3 నయోమీ ఒసాకా.. 2018 యూఎస్ ఫైనల్‌లో కూడా సెరేనా విలియమ్స్‌ను ఓడించింది. సెరేనా అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేయడమే కాకుండా.. తన బలమైన ఏస్‌లను సంధించడంతో విఫలం అయ్యింది. సెరేనా ఏస్‌ల కోసం ప్రయత్నించగా నయోమీ వాటిని సమర్ధవంతంగా ఎదుర్కున్నది. ఈ మ్యాచ్‌తో నయోమీ వరుసగా 20 మ్యాచ్‌లను గెలిచిన రికార్డు సృష్టించింది. నయోమీకి ఇది 4వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కావడం విశేషం.

ఇక మరో సెమీస్‌లో వరల్డ్ నెంబర్ 25 కరోలిన్ ముచోవాపై 22వ ర్యాంకర్ జెన్నిఫర్ బ్రాడి 6-4, 3-6, 6-4 తేడాతో విజయం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. తొలి సారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన జెన్నిఫర్ బ్రాడీ తన పాత ప్రత్యర్థి ఒసాకోతో తలపడనున్నది. గత ఏడాది జరిగిన యూఎస్ ఓపెన్ సెమీస్‌లో నయోమీ ఒసాకా చేతిలో ఓడిపోయిన బ్రాడీ.. ఫైనల్‌లో గెలిచి ఆనాటి పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవాలనే ఉత్సాహంతో ఉన్నది.

ఇక పురుషుల సింగిల్స్ సెమీఫైనల్‌లో వరల్డ్ నెంబర్ 1 నొవాక్ జకోవిచ్, రష్యాన్ ఆటగాడు అస్లన్ కరత్సెవ్‌పై 6-3, 6-4, 6-2 తేడాతో గెలిచి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నాడు. కరత్సెవ్ క్వాలిఫయర్‌గా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అడుగుపెట్టి ఎవరి అంచనాలకు అందకుండా సెమీఫైనల్ వరకు చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌ తొలి సెట్‌లో కరత్సెవ్ వరుసగా రెండు సార్లు జకోవిచ్ సర్వీస్ బ్రేక్ చేశాడు. కానీ ఎంతో అనుభవం ఉన్న జకోవిచ్ ఆ తర్వాత కరత్సెవ్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లు గెలిచి రికార్డు స్థాయిలో 9వ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం డానిల్ మెద్వెదేవ్, సెట్సిపాస్ మధ్య జరిగే సెమీస్‌ విజేత ఆదివారం జకోవిచ్‌తో టైటిల్ కోసం తలపడతాడు.

Advertisement

Next Story

Most Viewed