2023 మాదే.. ఓరుగల్లు కాంగ్రెస్‌లో ఫుల్‌జోష్..

by Shyam |   ( Updated:2021-06-28 04:08:31.0  )
2023 మాదే.. ఓరుగల్లు కాంగ్రెస్‌లో ఫుల్‌జోష్..
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామ‌కంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ క‌నిపిస్తోంది. ముఖ్యంగా యువ నేత‌ల‌కు మంచి అవ‌కాశాలు ద‌క్కుతాయ‌ని, నిజాయితీగా పార్టీకోసం ప‌నిచేసే నేత‌ల‌కు అవ‌కాశాలుంటాయ‌న్న భావ‌న పార్టీలో స‌ర్వత్రా వ్యక్తమ‌వుతోంది. రేవంత్‌రెడ్డి రాక‌తో పార్టీలో న‌వ‌శ‌కం ప్రారంభం కాబోతోంద‌ని కొంద‌రి అభిప్రాయం. ముల్లును ముల్లుతోనే తీసే మొన‌గాడు వ‌చ్చాడ‌ని మ‌రికొంద‌రు అభివ‌ర్ణిస్తుండ‌టం గ‌మ‌నార్హం. రాష్ట్రంలోనే అతిపెద్ద ప‌ట్టణంగా వ‌ర్ధిల్లుతున్న వ‌రంగ‌ల్‌లో కాంగ్రెస్ ఖ‌చ్చితంగా పుంజుకుంటుంద‌న్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు హస్తం పార్టీ లీడర్లు. ఈ క్రమంలోనే ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో రేవంత్‌రెడ్డి పాద‌యాత్ర ఉంటుంద‌ని జిల్లా ముఖ్యనేత‌ల ద్వారా అందిన సమాచారం. అయితే, ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా అభివృద్ధి విష‌యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, వివ‌క్ష చూపింద‌ని కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తుంది.

ప్రజా ఎజెండాతోనే పోరు..

ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో ప్రజా స‌మ‌స్యల‌తో కూడిన ప‌రిష్కారాల మార్గాల దిశ‌గా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయ‌బోతోంద‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. అభివృద్ధి మాటున జ‌రిగిన అవినీతి, అక్రమాల నిగ్గు తేల్చేందుకు రేవంత్‌రెడ్డి మార్గనిర్దేశంలో న‌డ‌వ‌నుంద‌ని పేర్కొంటున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక భూ క‌బ్జాలు జ‌రిగిన ప‌ట్టణంగా చారిత్రక ఓరుగ‌ల్లు ప‌ట్టణాన్ని చ‌రిత్ర పుట‌ల్లో నిలిపిన దుర్మార్గపు, నీచ‌పు చ‌రిత్ర టీఆర్ఎస్ పాల‌కుల‌కు ద‌క్కింద‌ని, వీట‌న్నింటిపై రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో పోరాడ‌బోతున్నామ‌ని చెబుతున్నారు. పార్టీపై జ‌నాల్లో ఆద‌ర‌ణ ఉంద‌ని, కావాల్సింద‌ల్లా చైత‌న్యమేన‌ని మ‌రికొంత‌మంది సీనియ‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

రేవంత్ పాద‌యాత్ర..

ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో ప్రజా స‌మ‌స్యల‌ను తెలుసుకునేందుకు అన్ని నియోజ‌క‌వర్గాల్లో రేవంత్‌రెడ్డి పాద‌యాత్ర చేప‌డ‌ుతార‌ని ముఖ్య నాయ‌కులు చెబుతున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధ‌న‌, టెక్స్‌టైల్ పార్కు, గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ అభివృద్ధిపై నిర్లక్ష్యం, రైతాంగం స‌మ‌స్యలు వంటి అంశాల‌పై ఈ పాద‌యాత్ర ద్వారా ప్రభుత్వాన్ని రేవంత్ నిల‌దీస్తార‌ని సమాచారం.

పార్టీకి జ‌వ‌స‌త్వాలు వ‌స్తాయి..

రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బ‌లోపేత‌మ‌వుతుంద‌న్న న‌మ్మకం మాకుంది. రేవంత్‌రెడ్డికి ఖ‌చ్చిత‌త్వంతో కూడిన దూకుడు నిర్ణయాలు తీసుకోవ‌డంలో దిట్ట. ఇప్పుడు అదే ఆయ‌న‌కు బ‌ల‌మైంది. రాబోయేది ఇక కాంగ్రెస్ ప్రభుత్వమే. ముల్లును ముల్లుతోనే తీయాల‌నే రీతిలోనే అధిష్ఠానం రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియ‌మించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజ‌నం మొద‌లుకాబోతోంది. అవినీతి, అక్రమాలకు పాల్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం, గులాబీ నేత‌లు రేవంత్ ప్రభంజ‌నంలో కొట్టుక‌పోబోతున్నారు.

-జ‌న‌గామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘ‌వ‌రెడ్డి

న‌వ‌శకం ఆరంభం..

రేవంత్‌రెడ్డి నియామ‌కంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు న‌వ‌శ‌కం ఆరంభమ‌వుతోంది. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో అనేక స‌మ‌స్యలున్నాయి. వాటిపై రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. పార్టీ శ్రేణులు మ‌రింత యాక్టివ్‌గా ప‌నిచేస్తాయి. ఎట్టి ప‌రిస్థితుల్లో 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది.

-నాయిని రాజేంద‌ర్‌రెడ్డి, వ‌రంగ‌ల్ అర్భన్ మ‌రియు రూర‌ల్ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుడు

Advertisement

Next Story

Most Viewed