స్టీరింగ్ స్టోరి: కారులో 59 దేశాలు.. 70 వేల కి.మీ

by Shyam |
స్టీరింగ్ స్టోరి: కారులో 59 దేశాలు.. 70 వేల కి.మీ
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త ప్రదేశాలు, విహారయాత్రలకు వెళితే నూతన ఉత్సహం వస్తుంది. థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్సెస్ మన సొంతమవుతాయి. ఆయా ప్రాంతాల భిన్న సంస్కృతీ సంప్రదాయాలు, ఆచారాలు తెలుసుకోవచ్చు. అంతేకాదు ఆ ప్రాంతాల్లో ఉండే గొప్ప వ్యక్తులు, చేంజ్‌మేకర్స్, ఆలోచనపరుల్ని కలుసుకునే వీలుంటుంది. అందుకే ట్రావెలర్స్ భుజానికి బ్యాగేసుకుని మదినిండైన సంతోషాలు, జ్ఞాపకాలను పోగేసుకుంటూ, కొత్త విషయాల అన్వేషణలో సాగిపోతుంటారు. ముంబైకి చెందిన ట్రావెలర్, సైక్లిస్ట్, బైకర్, రాక్ క్లైంబర్ ప్రవీణ్ మెహతా కేవలం 11 నెలల వ్యవధిలో 4 ఖండాల్లోని 59 దేశాలను కారులో పర్యటించి..150 మంది చేంజ్‌మేకర్స్‌ను ఇంటర్వ్యూ చేశాడు.

లైఫ్ జర్నీ చాలా చిన్నదే కానీ, ఆ ప్రయాణాన్ని ఎలా ఆస్వాదిస్తున్నామన్నదే ముఖ్యం. అందుకే ప్రవీణ్ తన మనసుకు నచ్చిన పనిచేస్తూ హ్యాపీ జర్నీ సాగిస్తున్నాడు. వీలైనన్ని దేశాలకు వెళ్లడంతో పాటు, ప్రపంచానికి వైవిధ్యం చూపిన వ్యక్తులను కలవడమే ప్రవీణ్ ఎజెండా. ఈ క్రమంలో అతను తన 59 దేశాల ప్రయాణాన్ని ఏప్రిల్ 2019న ప్రారంభించగా, 2020 మార్చిలో ముగించాడు. ముంబైలోని జుహు నుంచి బయలుదేరిన ప్రవీణ్..భూటాన్ చేరుకుని అక్కడ్నుంచి మళ్లీ ఇండియా చేరుకుని, ఆ తర్వాత మయన్మార్ మీదుగా మధ్య ఆసియా దేశాలు, రష్యా, బాల్టిక్, నార్డిన్ కంట్రీస్, యునైటెడ్ కింగ్‌డమ్‌తో పాటు 30 యూరోపియన్ దేశాలను సందర్శించాడు. బ్రిటన్‌లోని లండన్‌ నుంచి అమెరికాకు షిప్ మీదుగా వెళ్లగా, తన కారును వెంటతీసుకెళ్లాడు. మొత్తంగా 11 నెలల పాటు 50 దేశాల్లో 70 వేల కిలోమీటర్లను కారులోనే ప్రయాణించడం విశేషం కాగా, తన జర్నీ విశేషాలను ‘స్టీరింగ్‌ స్టోరి’ పేరుతో ఇన్‌స్టాగ్రాం పేజీలో మెహతా పంచుకున్నారు.

ఈ జర్నీలో సమాజంలో మార్పు తీసుకువస్తున్న 150 మందికి పైగా ‘చేంజ్ మేకర్స్’ ‘ఇన్‌ఫ్లుయెన్సర్స్’ని కలుసుకుని..వారిని ఇంటర్వ్యూ చేశాడు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో పెరువియన్ మాజీ అధ్యక్షుడు అల్బెర్టో ఫుజిమోరికి ఉన్న సంబంధాన్ని బహిర్గతం చేసినందుకు ఒకప్పుడు కిడ్నాప్ అయిన ప్రముఖ పరిశోధనాత్మక పాత్రికేయుడు గుస్తావో గోరెట్టిని కలిసి..ఆయన్ను ఇంటర్వ్యూ చేశాడు. మయన్మార్‌లో 1,30,000 మంది అంత్యక్రియలకు నిధులు సమకూర్చి..ప్రజారోగ్యం, విద్య కోసం పోరాడిన సామాజికవేత్త కయావ్ థును కలిశాడు. 4 వేల మంది మహిళలకు జన్మనివ్వడంలో సహాయం చేసిన మెగసెసే అవార్డు గ్రహీత సింథియా మాంగ్‌ని కలుసుకున్నాడు. పీస్ యాక్టివిస్ట్స్ (శాంతి కార్యకర్తలు), రాక్‌స్టార్స్, విప్లవాత్మక కవులు, స్టార్టప్ లీడర్స్, సామాజికవేత్తలు ఇలా ఎంతోమందిని ప్రవీణ్ కలిసి, వారి అనుభవాలను, ఆలోచనలను తెలుసుకున్నాడు. తన ప్రయాణంలో ఎక్కడా దొంగల బెదరింపులు, జాత్యాంహకారం దూషణలు ఎదుర్కొలేదని తెలిపాడు.

Advertisement

Next Story