ఆన్ లైన్ లో మద్యం ఆర్డర్ … అకౌంట్లో లక్ష మాయం

by Shyam |
ఆన్ లైన్ లో మద్యం ఆర్డర్ … అకౌంట్లో లక్ష మాయం
X

దిశ వెబ్ డెస్క్ :
భారత్‌లో కూడా కరోనా వ్యాప్తి చెందుతుండటంతో దేశమంతా లాక్‌డౌన్‌ కోనసాగుతోంది. ప్రజలంతా ఇల్లు దాటి బయటకు రావడం లేదు. అయినప్పటికీ రోజురోజుకు పెరుగుతున్న కేసులు, మృతుల సంఖ్య పెరుగుతుండటం దేశ ప్రజలను కలవర పరుస్తోంది. దీంతో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నాయి. నిత్యావ‌స‌ర వ‌స్తువులు త‌ప్ప ఏవి ప్రజలకు అందుబాటులో లేకుండాపోయాయి. ఈ కరోనా ఎఫెక్ట్‌ మందుబాబులపై కూడా పడింది. లాక్‌డౌన్‌ వల్ల మద్యం షాపులన్నీ బంద్‌ చేశారు. దీంతో చాలా మంది ఆన్ లైన్లో మద్యం కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే మంచి తరుణమని భావించిన సైబర్ మోసగాళ్లు నకిలీ వెబ్ సైట్లతో .. వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. మద్యం సరఫరా చేస్తామంటూ.. లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. ముంబైకి చెందిన దంపతులు ఆన్ లైన్ మద్యం ఆర్డర్ చేసి.. లక్ష రూపాయలు పొగొట్టుకున్నారు.

లాక్ డౌన్ కొనసాగుతుండటంతో.. లిక్కర్‌ షాపులన్నీ బంద్ అయ్యాయి. మద్యప్రియులు మందు ఎక్కడ దొరకుతుందా అంటూ గాలించడం మొదలుపెట్టారు. మందుబాబుల కన్ను ఆన్ లైన్ అమ్మకాలపై పడింది. గూగుల్ మొత్తం జల్లెడు పడుతూ.. ఆన్ లైన్ మద్యం అమ్మే సైట్లను శోధిస్తున్నారు. అలానే ముంబైలోని చెంబూర్ కు చెందిన భార్యభర్తలు మార్చి 24న ఆన్ లైన్ లో మద్యం కొనుగోలు చేసేందుకు .. ఆన్ లైన్ సెర్చ్ చేశారు. ఓ ఫోన్ నెంబర్ లభించడంతో.. దానికి కాల్ చేశారు. ఆన్‌లైన్ కొనుగోలు కోసం రూ.3,000 చెల్లించాలని ఓ వ్యక్తి వారిని కోరాడు. దీని కోసం ఓ ఓటీపీ వస్తోందని, అది చెప్పమని అడిగాడు. ఆ వ‍్యక్తి మాటలను నమ్మిన దంపతులు.. ఓటీపీని వారికి చెప్పారు. దీంతో వెంటనే బాధితుడి ఖాతా నుండి రూ.30,000 కట్ చేసుకున్నాడు. బాధితుడు వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేసి రూ.. 30 వేలు ఎందుకు తీసుకున్నారని నిలదీశారు. పొరపాటున ఓ సున్న ఎక్కువ కొట్టానని.. వెంటనే రిటర్న్ చేస్తానని చెప్పాడు. అలా.. సుమారు ఆరుసార్లు ఓటీపీ చెప్పమంటూ.. రూ. 1.03 లక్షలు దోపిడి చేశారు.

మద్యం రాకపోవడంతో :

ఎంతసేపటికీ మద్యం రాకపోవడంతో … ఆ దంపతులు కాసేపటికి ఆ నంబర్ కు ఫోన్ చేశారు. అయితే డబ్బులు తమకు జమ కాలేదని సరుకుని డెలివరీ చేయలేమని చెప్పాడు. అంతేకాదు మరొక కార్డు ఉపయోగించి రూ. 3 వేలు చెల్లిస్తే.. మద్యం సరఫరా చేస్తామని తెలిపాడు. దీంతో మోసపోయామని గ్రహించిన ఆ దంపతులు ముంబైలోని తిలక్ నగర్ పోలీసులకు మార్చి 27వ తేదీన ఫిర్యాదు చేశారు.

మందు బాబులు పారాహుషార్ :

మద్య దుకాణాలు తీయకపోవడంతో.. మందు బాబులు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. బ్లాక్ లోనూ వేలకు వేల పోసి .. బాటిళ్లు కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది. పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేయడంతో.. ఆన్ లైన్ బాట పట్టారు. కానీ సైబర్ మోసగాళ్లు .. కరోనా టైమ్ ను బాగా వాడుకుంటున్నారు. మొన్నటి వరకు కరోనా పేరుతో నకిలీ వెబ్ సైట్లు సృష్టించి అకౌంట్లు హ్యాక్ చేసిన సైబర్ నేరగాల్లు.. ఇప్పుడు మందు బాబుల వీక్ నెస్ ను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆఫ్ లైన్ లోనే కాదు.. ఆన్ లైన్ లోనూ నిత్య అవసర వస్తువులు తప్ప .. ఇంకే ఇతర వస్తువులను అమ్మడం లేదు. కావున మందు బాబులు దీన్ని గమనించాలి. బ్లాక్ లో కొన్నా.. చట్ట పరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Tags: coronavirus, lockdown, cyber crime, mumbai, police, liquor, online

Advertisement

Next Story

Most Viewed