ఆ రెండు తెలుగు సినిమాల సంగతేంది: సుప్రీంకోర్టు

by GSrikanth |
Supreme Court Seeking to Transfer All Cases Against Nupur Sharma to Delhi
X

దిశ, తెలంగాణ బ్యూరో: గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి పన్ను రాయితీ ఇచ్చినా అది అమలు కాలేదని, సినీ ప్రేక్షకులకు రిలీఫ్ లేదని దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ, హోం శాఖ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం విచారణ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు సినిమాలకు రాయితీలు ప్రకటించినా వాటి ప్రయోజనాలు, ఫలాలు ప్రేక్షకులకు అందలేదని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం ఆ పిటిషన్‌లో పేర్కొన్నది. పిటిషన్‌లో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ఇరు రాష్ట్రాల రెవెన్యూ ముఖ్య కార్యదర్శులు, వాణిజ్య పన్నుల కమిషనర్లు, 'గున్న టీం వర్క్స్‌', ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ రాజీవ్‌రెడ్డి, సినీ నటుడు నందమూరి బాలకృష్ణలను ప్రతివాదులుగా చేర్చడంతో వీరికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

గతంలో ఉమ్మడి హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇలాంటి వ్యవహారంపై ఉత్తర్వులు జారీ చేసిందని, కానీ డివిజన్ బెంచ్ మాత్రం ఈ ఉత్తర్వులను నిలిపేసిందని పిటిషనర్ గుర్తుచేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను అమలుచేయాలని లేదా గతంలో ఇలాంటి వ్యవహారాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేలా చూడాలని పిటిషన్‌లో ప్రేక్షుకల వినియోగదారుల సంఘం విజ్ఞప్తి చేసింది. పన్ను రాయితీ రూపంలో పొందిన డబ్బును తిరిగి ప్రభుత్వం రికవరీ చేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం ఈ చిత్రాలకు రాయితీ ప్రకటించినా ప్రేక్షకుల నుంచి మాత్రం కోట్లాది రూపాయల వినోదపు పన్నును వసూలు చేశారని, దాన్ని ప్రభుత్వం రికవరీ చేయాలని పిటిషన్‌లో ఆ సంఘం కోరింది.

పిటిషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు... నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రతివాదులకు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను నవంబరులో చేపట్టనున్నట్లు ప్రకటించింది. గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాల వినోదపన్ను విషయంలో మెరిట్స్ ను పరిగణలోకి తీసుకోలేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed