రామోజీరావుకు అశ్రు నివాళి అర్పించిన నందమూరి ఫ్యామిలీ

by Kavitha |
రామోజీరావుకు అశ్రు నివాళి అర్పించిన నందమూరి ఫ్యామిలీ
X

దిశ, సినిమా: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారనే విషయం తెలిసిందే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రముఖులెందరో నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామోజీరావు మృతి పట్ల నందమూరి ఫ్యామిలీ కూడా నివాళులు అర్పించింది. బాలకృష్ణ, రామకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారంతా రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళులు అర్పించారు.

రామోజీరావు గారికి అశ్రు నివాళి- నందమూరి బాలకృష్ణ

తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందారు రామోజీరావు. తెలుగులోనే కాదు దేశ పత్రికా రంగంలోనే ఓ కొత్త ఒరవడిని సృష్టించి భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శిగా నిలిచారు. తెలుగు నుడికారానికి ఒక కొత్త కళను తెచ్చారు. జర్నలిజానికి కొత్త సొబగులు దిద్దారు. చిత్ర సీమలో అదే తీరున సాగి ఉషోదయ కిరణాలను ప్రసరింప చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోగా రామోజీ ఫిలిం సిటీని తెలుగు నేలపై నెలకొల్పారు. ఏది చేసినా తనదైన బాణీ కల్పిస్తూ సాగిన రామోజీరావు ఇక లేరు అన్న వార్త ఆవేదన కలిగిస్తోంది. మా తండ్రిగారు నందమూరి తారక రామారావు గారితో ఆయన అనుబంధం ప్రత్యేకమైనది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది: జూనియర్ ఎన్టీఆర్

రామోజీరావు గారి లాంటి దార్శనికులు నూటికో కోటికో ఒక్కరు. మీడియా సామ్రాజ్యాధినేత, భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

ఆయన సేవలు చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి: నందమూరి కళ్యాణ్ రామ్

రామోజీరావు గారు భారతీయ మీడియా మరియు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడుతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

వారెక్కడ ఉన్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలి: నందమూరి రామకృష్ణ

ఈనాడు గ్రూప్ / మార్గదర్శి సంస్థల అధినేత రామోజీరావు గారి మరణం మనందరికీ తీరనిలోటు. వారు తండ్రి సమానులు. ఒక రైతు కుటుంబంలో జన్మించి వ్యవసాయంలో వారి తండ్రుకి చేదోడుగా ఉంటూ కష్టపడి చదువుకున్నారు రామోజీ రావు గారు. అన్ని రంగాల్లో వారు వారి సేవలందించారు. ఇటు ప్రెస్ మీడియా/జర్నలిజం లీడరే కాకుండా….మార్గదర్శి చిట్స్ / ఫైనాన్స్ చైర్మన్ గాను… సినీ నిర్మాతగా, సినీ స్టూడియో అధినేతగా… వివిధ రంగాల్లోనూ చాలా మందికి ఉద్యోగాలు కల్పించి అందరిని ఆదుకున్నారు రామోజీ రావు గారు. వారెక్కడ ఉన్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ… మా కుటుంబం తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము.

Advertisement

Next Story