దేశంలో పరిపాలనా భాషలుగా మాతృభాషలే ఉండాలి: ఉప రాష్ట్రపతి

by Sridhar Babu |
Venkaiah-1
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: దేశంలో పరిపాలనా భాషలుగా మాతృభాషలే ఉండాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. పరాయి పాలకులు మన భాష సంస్కృతుల పట్ల ఓ ప్రతికూల భావాన్ని, ఆత్మన్యూనతను మన మనసుల్లో నాటే ప్రయత్నం చేశారని, కొందరు నేటికీ వాటిని గుడ్డిగా అనుసరించడం బాధాకరమన్నారు. ఈ ఆత్మన్యూనతను వదిలించుకుని భాష సంస్కృతుల గొప్పతనాన్ని ఘనంగా చాటుకోవాలని దిశానిర్దేశం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను విద్యార్థులు అర్ధం చేసుకుని భవిష్యత్తులో వాటిని అనుసరించేలా అర్థవంతమైన జీవితాన్ని అందించడం విద్యాలక్ష్యాల్లో ఒకటన్న ఆయన, విద్య ద్వారా విద్వత్తు, వినయంతో పాటు భవిష్యత్ జీవనానికి అవసరమైన మార్గదర్శనం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఏ సంప్రదాయమైనా ఓ తరం నుంచి మరో తరానికి వారసత్వంగా అందుతుందన్న ఉపరాష్ట్రపతి మన వారసత్వాన్ని కాపాడి, ముందు తరాల్లో జవసత్వాలను నింపే మహోన్నతమైన ఆచార వ్యవహారాల సమాహారమే సంస్కృతి అని పేర్కొన్నారు. ఆదివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాయల వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాష మీద నూతన విధానంలో పరిశోధనలకు చొరవ తీసుకోవాలని, ముఖ్యంగా తెలుగు భాషను ముందు తరాలకు మరింత ఆసక్తికరంగా అందించేందుకు అవసరమైన విధానాల మీద దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఈ దిశగా సాగే పరిశోధనలకు అవకాశం కల్పించాలని సూచించారు. తెలుగు విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కవి, విమర్శకుడు డా. కూరెళ్ల విఠలాచార్య, కూచిపూడి నాట్యాచార్యులు కళాకృష్ణలకు ఉపరాష్ట్రపతి అవార్డులను ప్రదానం చేశారు.

Venkaiah-2

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన విఠలాచార్య 22 పుస్తకాలను వెలువరించడమే కాకుండా సుమారు రెండు లక్షల పుస్తకాలతో అందరికీ ఉపయోగపడేలా తమ సొంత ఇంటిలోనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అలాగే సత్యభామ పాత్రలో ఒదిగిపోయి నటించే కళాకృష్ణ నాట్య, అభినయ పటిమలను అభినందించారు. విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్న ఉపరాష్ట్రపతి, తెలుగు భాష, సంస్కృతుల అభివృద్ధి కోసం చొరవ తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావుకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి తంగెడ కిషన్ రావుకు, రిజిస్ట్రార్ భట్టు రమేష్, ఇతర బోధన, బోధనేతర సిబ్బందికి, విద్యార్థులకు ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు భాషాబోధన, పరిశోధన, ప్రచురణ, విస్తరణ సేవ వంటి కార్యక్రమాల ద్వారా తెలుగు భాషను, సాహిత్యాన్ని, సంస్కృతిని, చరిత్రను పరిరక్షించుకుంటున్న విశ్వవిద్యాలయ సంకల్పాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హోంశాఖామాత్యులు మహమూద్ అలీ, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్ కుమార్, విశ్వవిద్యాలయ ఉపకులపతి తంగెడ కిషన్ రావు, రిజిస్ట్రార్ భట్టు రమేష్, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed