కాంగ్రెస్‌లో కల్లోలం.. కరీంనగర్ ముఖ్యనేతలను పిలిచారా.. కావాలనే మరిచారా..?

by Sridhar Babu |
jeevan
X

దిశప్రతినిధి, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. సాక్షాత్తూ రాష్ట్ర ఇంఛార్జి హాజరైన కార్యక్రమంలో కూడా ఈ ఇద్దరు నాయకులు కనిపించకపోవడం విస్మయం కల్గిస్తోంది. గ్రాడ్యూయేట్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహిస్తున్న సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కనిపించకపోవడం పార్టీ కేడర్‌లో కొత్త చర్చకు తావిచ్చింది.

ఎంపీ పరిధేనంటూ..

దళిత గిరిజన దండోరా కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కేవలం కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలోని కార్యకర్తలు మాత్రమే ఆహ్వానం ఉందంటూ కూడా చెప్తున్నారు. కరీంనగర్ లోకసభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లకు చెందని వారు కాదన్న కారణంగానే వారు హాజరు కాలేదని అంటున్నారు. ఈ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కూడా అటెండ్ అయ్యారు. అయితే, జీవన్ రెడ్డి నాలుగు జిల్లాల నుండి శాసనమండలికి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ ఆయన హాజరు కాకపోవడం గమనార్హం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్షునిగా, మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీధర్ బాబు ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నికల కమిటీలో కూడా ఉన్నారు. జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లను ఎన్నికల కమిటీ కన్వీనర్లుగా పీసీసీ నియమించింది. అయితే, ఆదివారం కరీంనగర్ లోక్‌సభ పరిధి సమావేశం జరిగినప్పటికీ వీరు మాత్రం హాజరు కాలేదు. దీని పరిధిలోనే హుజురాబాద్ నియోజకవర్గం ఉండటం, రాష్ట్ర ఇంఛార్జీ కూడా ఇక్కడకు రావడంతో కాంగ్రెస్ అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో లేరనే కారణాన్ని చూపుతున్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. జీవన్ రెడ్డి నాలుగు జిల్లాల నుండి ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహిస్తుండగా, ఇందులో కరీంనగర్ కూడా ఉండడం గమనార్హం .

పిలిచారా.. లేదా.?

డీసీసీ ఆఫీసులో జరిగిన సమావేశానికి హాజరయ్యే వారికి పాసులు కూడా జారీ చేశారు. అయితే ఎమ్మెల్సీ, జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబులను పిలిచారా లేదా అన్న చర్చ ప్రస్తుతం జోరుగా నడుస్తోంది. ఇతర ప్రాంతాల నాయకులన్న కారణంతో పిలవలేదా లేక వీరికి ఆహ్వానం పంపినా రాలేదా అన్న అయోమయంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed